hyderabad: Rs.300 crore illegal Villa Rani arrested
Hyderabad: రూ.300 కోట్ల అక్రమాల విల్లా రాణి అరెస్టు
అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యాజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు.
అర్ధరాత్రి విదేశాలకు పారిపోతుండగా చిక్కిన నిందితురాలు
అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యాజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అర్ధరాత్రి విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమవగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని గురువారం రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సతీశ్ వివరాలు వెల్లడించారు.
అన్నీ అక్రమాలే
నిజాంపేట బాలాజీనగర్‌కు చెందిన గుర్రం విజయలక్ష్మి (48) శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్ అండ్, భావన జీఎల్‌సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించింది. 2018లో మల్లంపేటలోని 170/3, 170/4, 170/4ఎ సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టింది. మొత్తం 325 విల్లాలలో 65కు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించారు. దాదాపు 260 విల్లాలను విక్రయించింది. అవన్నీ అక్రమమని ఫిర్యాదులు రావడంతో 2021లో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ విచారణ జరిపించి 201 విల్లాలను సీజ్ చేశారు. అయినా తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించింది. వాటిలో స్థానిక కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించినవి 26. ఈ విషయాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గత సెప్టెంబరులో గుర్తించారు. అదేనెలలో హైడ్రా ఆధ్వర్యంలో 15 విల్లాలను కూల్చివేశారు.
మోసాల పరంపర
దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో విజయలక్ష్మి మీద 2021-2024 మధ్య 7 కేసులు నమోదయ్యాయి. మల్లంపేటలోని సర్వేనం 170లోని ప్రభుత్వ భూమిని కొంత అక్రమించి 2024లో 5 విల్లాలను నిర్మిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి ఆగస్టులో ఆర్‌ఐ ప్రదీప్‌రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు మరో 4 కేసులు నమోదయ్యాయి. నిందితురాలు అమెరికా వెళ్లేందుకు బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పాస్‌పోర్టు, వీసా తనిఖీ సమయంలో లుక్‌అవుట్ నోటీసు ఉన్నట్లు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో నిందితురాలు గుండెపోట్లు వచ్చినట్లు నటించింది.
COMMENTS