A woman's head and arm were cut off while looking from the window of the RTC bus
దారుణ ఘటన.. ఆర్టీసీ బస్సు కిటికిలో నుంచి చూస్తుండగా మహిళ తల, చేయి కట్!
కర్నాటకలోని మైసూరులో దారున ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనం కిటికీలో తల బయటకు పెట్టి వాంతు చేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ తల తెగి రోడ్డుపై పడిపోయింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి బస్సు ప్రయాణికురాలు దుర్మరణం చెందింది. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద శనివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) అనే మహిళ కర్ణాటక ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చుని ఉంది. ఆమె వాంతి చేసుకునేందుకు బస్సు కిటికీలో నుంచి తల బయటకు పెట్టింది. అయితే సరిగ్గా అదే సమయంలో టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ దూసుకుపోయింది. దీంతో మహిళ తలతోపాటు కుడి చేయి తెగి రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 11.15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆమె మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ప్రయాణికురాలి కుడిచేతి కూడా ఫ్రాక్చర్ అయింది.
ఈ ఘటనలో శివలింగమ్మ సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులందరూ భయంతో కేకలు వేశారు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. మైసూరు సబర్బన్ బస్టాండ్ నుండి నంజన్‌గూడ్ మీదుగా గుండ్లుపేటకు వెళుతున్న కెఎస్‌ఆర్‌టిసి బస్సు నంజన్‌గూడ్ తాలూకా ముద్దహళ్లి గేట్ సమీపంలో లారీని ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు నంజన్‌గూడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సును సీజ్ చేసి, మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతురాలు శివలింగమ్మ భర్త రేవణ్ణ కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె స్వస్థలం గుండ్లుపేట తాలూకా ఆలహళ్లి. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువు నిశ్చితార్థం అనంతరం బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన శివలింగమ్మ శుక్రవారం రాత్రి మైసూరులోని జేపీ నగర్‌లోని కుమార్తె ఇంట్లో బస చేసింది. కొత్త ఇల్లు కట్టుకుంటున్న ఆమె తన స్వస్థలమైన ఆలహళ్లికి చేరుకోవడానికి బేగూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు నంజన్‌గూడు ట్రాఫిక్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
COMMENTS