Fake currency circulation gang
Telangana: పైకి చూసి సాధారణ గొర్రెల కాపరి అనుకునేరు.. పోలీసులు ఎంక్వయిరీ చేయగా
వరంగల్ కమిషనరేట్ లో నకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టయింది. ఎనిమిది మంది సభ్యుల ముఠా అడ్డంగా బుక్కయింది. వారి వద్ద భారీ ఎత్తున అసలు కరెన్సీతో పాటు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేసాడు. ఈ క్రమంలోనే తనకు పరిచయమైన వ్యక్తులతో అడవిలో డబ్బులతో నిండి ఉన్న డ్రమ్ము దొరికిందని, అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదురౌవుతున్నాయని నమ్మించాడు. తనకు ఎవరైన ఒక లక్ష రూపాలు ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు నాలుగింతలు ఇస్తానని నమ్మించాడు.
కరీంనగర్ జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్ వద్ద తన ప్లాన్ ను అమలు చేశాడు. ప్లానులో భాగంగా పాల్వంచ అడవిలో ముందుగా అసలు, నకిలీ రూపాయల నోట్లతో భద్రపర్చిన డ్రమ్ము నుండి అసలు ఐదు వందల రూపాయల నోట్ల కట్టను శ్రీనివాస్ కు చూపించడంతో అవి ఒరిజినల్ కరెన్సీ గా నమ్మాడు. పదిలక్షల అసలు నోట్లకుగాను ఇరవై లక్షల రూపాయల నకిలీ నోట్లను మార్పిడి చేసుకోవడానికి వీరిద్దరి మధ్యా అంగీకారం కుదిరింది. అయితే తనకు ఆ డబ్బును హనుమకొండకు తీసుకొచ్చి ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. ఈ క్రమంలోనే వేముల వెంకటయ్య దరామోత్ శ్రీను, తేజావత్ శివ, గుగ్గోత్ వీరన్న, ఉడుతా మల్లేష్, ఎర్రగొల్ల అజయ్ అనే వ్యక్తులు కారులో వచ్చి దొంగ నోట్లు వారికి చేరవేయడానికి సిద్ధమయ్యారు.
కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి క్రాడ్ రోడ్ వద్ద తనిఖీల్లో భాగంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ద్వారా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు ముఠా గుట్టు రట్టయింది. ప్రధాన నిందితుడు ఇదే తరహాలో మరో మిత్రుడితో కల్సి తెల్ల కాగితాలపై ఐదు వందల రూపాయల నోటు ముద్రించి పలు మార్లు విక్రయిస్తూ పోలీసులకు దొరికాడు. సత్తుపల్లి, వి.ఎం. బంజర, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్లో ప్రధాన నిందితుడిపై కేసులు నమోదు అయ్యాయి. 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కారు, నకిలీ నోట్లు తయారీ కి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. 34 లక్షలు అసలు కరెన్సీతో పాటు, 21 లక్షలు ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.. ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
COMMENTS