Do you know why horses are poisoned by snakes?
Snake Bite: గుర్రాలకు పాము విషం ఎందుకు ఎక్కిస్తారో తెలుసా..?
పాముకాటుకు యాంటీవీనమ్ (Anti Venom) ఇంజెక్షన్లను విరుగుడుగా ఇస్తారు. వీటి తయారీ చాలా కష్టమైన ప్రక్రియ.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. పాము కాటు (Snake Bite) మరణాలు మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 50 లక్షలకు మందికి పైగా పాముకాటుకు గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాము విషానికి విరుగుడు సరిపడా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని నిపుణుల వాదన. అయితే, పాటు కాటుకు విరుగుడుగా ఇచ్చే యాంటీవినమ్ ఇంజెక్షన్ల తయారీలో ఉన్న సంక్లిష్టతల వల్లే వాటిని ఎక్కువగా తయారు చేయడం సాధ్యం కావడం లేదు. ఇంతకీ యాంటీవీనమ్‌ను ఎలా తయారు చేస్తారు. అందులో గుర్రాల పాత్ర ఏంటో చూద్దాం..
ఇతర జీవుల నుంచి తమని తాము రక్షించుకోవడానికే పాములు కాటేస్తాయి. విషపూరిత పాము కాటు (Snake Bite) మానవ శరీరంలో నాడీ వ్యవస్థ, గుండె, రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలపై ప్రభావం చూపుతుంది. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటివి చాలా విషపూరితమైనవి. ఇవి కాటు వేసినప్పుడు సరైన సమయంలో చికిత్స అందించకపోతే, ప్రాణాంతకమవుతుంది.
యాంటీవీనమ్ విరుగుడు
పాముకాటుకు యాంటీవీనమ్ (Anti Venom) ఇంజెక్షన్లను విరుగుడుగా ఇస్తారు. వీటి తయారీ చాలా కష్టమైన ప్రక్రియ. ముందు పాము విషాన్ని సేకరిస్తారు. దాన్ని గుర్రాల వంటి జంతువులకు ఇంజెక్ట్ చేస్తారు. ఆ విషాన్ని ఎదుర్కోవటానికి ఆ జంతువుల్లో యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. అనంతరం గుర్రం రక్తాన్ని సేకరించి అందులో నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. దాన్నుంచి యాంటీబాడీలను సంగ్రహిస్తారు. పాము విషంలో మూడు వేళ్ల వంటి పొడవైన న్యూరోటాక్సిన్లు నాడులను దెబ్బతీసి, అవయవాలు చచ్చుబడేలా చేస్తాయి. యాంటీబాడీలు సరిగ్గా ఈ న్యూరోటాక్సిన్లపై పోరాడి వాటిని నిర్వీర్యం చేస్తాయి.
గుర్రాలే ఎందుకు?
ఈ యాంటీవీనమ్ (Anti Venom) ఇంజెక్షన్ల తయారీకి గుర్రాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటి ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడమే దీనికి కారణం. తక్కువ మొత్తంలో విషాన్ని గుర్రాలు సమర్థంగా ఎదుర్కోగలుగుతాయి. కావాల్సిన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.
జంతు ప్రేమికుల ఆందోళన
పాము కాటు నుంచి పరోక్షంగా ఈ గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని కాపాడుతున్నాయి. విషపూరిత పాములు అధికంగా ఉండే భారత్ వంటి దేశాల్లో ఈ యాంటీవీనమ్ (Anti Venom) ఇంజెక్షన్లు చాలా కీలకం. అయితే, ఈ ప్రక్రియలో గుర్రాలను ఉపయోగించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. వాటికి దీర్ఘకాలంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తప్పని లోపాలు
గుర్రాలను ఉపయోగించి తయారు చేసే యాంటీవీనమ్‌లో (Anti Venom) కొన్ని లోపాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వాటి నుంచి సంగ్రహించి తీసుకున్న యాంటీబాడీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అలర్జీలకు కారణమవుతున్నట్లు గుర్తించారు. అలాగే ఆ యాంటీబాడీలు కొన్నిరకాల విషాలకు అంతగా పనిచేయకపోవటాన్ని గమనించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించే పాములకు అనుగుణంగా మాత్రమే అవి పనిచేస్తున్నట్లు తేల్చారు. దీంతో యాంటీవీనమ్ ఇంజెక్షన్లు అన్ని పాములకు విరుగుడుగా పనిచేయకపోయే ప్రమాదం ఉంది.
భారత్‌లోనే 42 శాతం మరణాలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 1.4 లక్షల మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 42 శాతం మంది భారత్ నుంచే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన, ప్రభావవంతమైన ప్రక్రియ ద్వారా యాంటీవీనమ్ ఇంజెక్షన్లను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
COMMENTS