Deputy collector job for auto wala daughter.
Inspiration Story: ఆటో వాలా కూతురికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. స్ఫూర్తిదాయక గాథ!
మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిసన్ 2022 తుది ఫలితాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టాపర్స్ జాబితాను కూడా కమిషన్ విడుదల చేసింది. జనవరి 18న ఫలితాలు వెలువడగా.. టాప్ 10 టాపర్స్‌లో 6 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్‌కు ఎంపికయ్యారు. వారిలో రేవాకు చెందిన అయేషా అన్సారీ ఒకరు. ఆమె కోచింగ్ లేకుండానే ఎంతో కఠినమైన ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం ర్యాంకర్లలో అయేషా అన్సారీ 12వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైంది. అయేషా అన్సారీ విజయగాథ ఆమె మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రేవాలోని అమాహియా ప్రాంతంకి చెందిన ఆయేషాకు మూడో అటెంప్ట్‌లో విజయం సాధించింది. దీనికి ముందు రెండుసార్లు పిసిఎస్ పరీక్ష రాసింది. కాని విజయం సాధించలేదు. మూడో ప్రయత్నంలో మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ పరీక్షలో 12వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఎస్‌డీఎం ఉద్యోగానికి ఎంపికైంది. ఆయేషా తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండటంతో ఖరీదైన కోచింగ్‌కు వెళ్లలేని పరిస్థితి. అయినా అధైర్య పడంకుండా సొంతంగా స్టేట్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమైన అయేషా పట్టుదలతో ఈ విజయం సాధించింది. తగిన సౌకర్యాలు లేకపోయినా.. తన చుట్టూ ఉన్న వనరులను వినియోగించుకుని విజయం సాధించి మరెందరికో ఆదర్శంగా నిలిచింది.
ప్రభుత్వ ప్రవీణ్ కుమారి హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్రాథమిక విద్యా పూర్తి చేసిన అయేషా.. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి పీసీఎస్ పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమయ్యేలా ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు పెద్దగా చదువుకునే అవకాశం రాలేదని, అయితే తాను చదువుకుని ముందుకు సాగాలని వారు కోరుకుంటున్నారని అయేషా చెప్పింది. అయేషా తండ్రి ఎప్పుడూ తనను బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారని, అందువల్లనే చదువుపై ఎప్పుడూ స్పృహతో ఉంటూ.. సమయాన్ని వృథా చేయకుండా సిద్ధమైనట్లు తెల్పింది. కష్టపడి చదివి తల్లిదండ్రుల కల నెరవేర్చినట్లు ఆనందం వ్యక్తం చేసింది.
COMMENTS