DJs with loud sounds - incidents of babies dying in the womb!
భారీ శబ్దాలతో డీజేలు - గర్భంలోని శిశువులూ చనిపోతున్న ఘటనలు!
ప్రాణాలు తీస్తున్న డీజేలు భారీ శబ్దాలు - ఉన్నట్లుండి కుప్పకూలుతున్న యువత.
Noise May Cause in Increase in Risk Of Heart Disease : ఏవైనా ఫంక్షన్లు అయినప్పుడు జోష్ కోసం మితిమీరిన శబ్దాలతో పెడుతున్న డీజేలు మరణ మృదంగాలవుతున్నాయి. అప్పటివరకు సంతోషంగా డాన్స్ చేస్తున్నవారు ఉన్నట్లుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందుతున్నారు. ఫలితంగా వేడుకలు కాస్త విషాద వేదికలుగా మారుతున్నాయి. శబ్దాలు హోరుకు వయసు మళ్లిన వృద్ధులే కాదు యువత కూడా మృత్యువాత పడుతున్నారు. పెళ్లిలో హుషారుగా నృత్యం చేస్తునే ప్రాణాలు వదులుతున్నారు. కొందరు డీజేల వద్దని కుప్పకూలి చనిపోతుంటే మరికొందరు ఇళ్లకు వెళ్లాక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నిర్వహించే భారీ ఊరేగింపుల్లో డీజేల వల్ల కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఇరుగుపొరుగు వారూ ఉక్కిరిబిక్కిైరై ఆసుపత్రి పాలవుతున్నారు.
చప్పుడు ఎక్కవైతే నష్టాలే :
అధిక శబ్దాల వల్ల గుండెపోటు, వినికిడి శక్తి కోల్పోవడం, బ్రెయిన్‌స్ట్రోక్, కర్ణభేరి దెబ్బతినడం, చెవిలో శబ్దాలు రావడం, ఒత్తిడి, నిద్రలేమి, చెవిలో శబ్దాలు కావడం, మానసిక ఆందోళన, గుండె దడ, అధిక రక్తపోటు, గర్భవిచ్ఛిత్తి, గర్భంలోని శిశువుకు భవిష్యత్తులో వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పెద్ద పెద్ద చప్పుళ్ల వల్ల అలజడిగా ఉన్న సమయంలో బాధితులను ఎలాంటి శబ్దాలు లేని ప్రశాంతంగా ఉన్న గదిలోకి తీసుకెళ్లాలి. గాలి ఆడేలా కూర్చోబెట్టి తాగే నీళ్లు ఇవ్వాలి. దీనివల్ల బాధితులకు కొద్దిసేపటికి ఉపశమనం కలుగుతుంది. భారీ శబ్దాలకు గుండెదడ పెరిగి, తీవ్రంగా చెమటలు పట్టి, కళ్లు తిరిగి ఎవరైనా కిందపడి పోతే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించాలి.
వినికిడి లోపానికి దారి :
సాధారణంగా 70 డెసిబుల్స్ శబ్దాలను వినడానికి చెవులు సహకరిస్తాయి. 70-85 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని 8గంటల పాటు వినొచ్చు. 90 డెసిబుల్స్‌కు 4 గంటలే పరిమితి. అంతకంటే ఎక్కువసేపు వింటే చెవుల్లోని సున్నిత కణాలు ప్రకంపనలకులోనై దెబ్బతింటాయి. ఇది శాశ్వత వినికిడి లోపానికి దారి తీసే అవకాశముంటుంది. డీజే శబ్దం 200 డెసిబుల్స్ పైనే ఉంటుంది. ఈ శబ్దాలు వినికిడిపై అత్యంత ప్రభావం చూపుతాయి.
డుగ్గు డుగ్గు శబ్దాలతో.. హైదరాబాద్ వాసుల గూబ గుయ్‌మంటోంది
రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి 6 గంటల మధ్య ఊరేగింపులను భారీ శబ్దాలతో నిర్వహించకూడదు. 70 డెసిబుల్స్ స్థాయి వరకే సౌండ్ పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా అంతకుమించి సౌండ్ పెడితే చట్టరీత్యా నేరం. అయినా ఇది ఎక్కడా అమలు కావడంలేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, కోర్టులను సైలెన్స్ జోన్లుగా పరిగణిస్తారు. వీటి పరిధిలో ఎలాంటి శబ్దాలకూ అనుమతి లేదు.
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం బండారులంక గ్రామానికి చెందిన 22 ఏళ్ల వినయ్ దసరా ఊరేగింపులో అధిక శబ్దాల మధ్య ఉత్సాహంగా డాన్స్ చేశారు. అలా నృత్యం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అర్లికి చెందిన బండారు రాజపాత్రుడు నాగుల చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చేసుకుంటున్నారు. అయితే పండుగా సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన డీజే శబ్దాన్ని తట్టుకోలేత గుండెపోటుతో మృతి చెందారు.
విజయనగరం జిల్లా నిజాంపట్నం మండలంలోని కూచినపూడిలో వినాయకుడి నిమజ్జనానికి డీజే ఏర్పాటు చేశారు. ఆ శబ్దానికి ఓ యువకుడు మరణించాడు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ జంట పెళ్లి కనులపండుగగా జరిగింది. కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెద్ద శబ్దంతో పెట్టిన పాటలకు పెళ్లి కుమారుడు గణేశ్ నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం సీతంపేటలో గతేడాది జరిగిన పెళ్లి వేడుకల్లో రాణి(30) అనే మహిళ సంతోషంగా డాన్స్ చేశారు. ఈక్రమంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణి మ మృతి చెందారు. డీజే శబ్దాలకు ఆమెకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
జనగామ జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అందరూ పెళ్లి సంతోషంలో ఉండగా, వరుడి నానమ్మ గుండెపోటుతో కుప్పకూలారు, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. ఆ విషయం తెలిసేలోపే వరుడి తరఫు బంధువైన మరో వృద్ధుడూ మృతిచెందారు. ఈ మరణాలకు డీజే శబ్దాలే కారణమై ఉండొచ్చని వైద్యులు తెలిపారు.
అన్ని నష్టాలే : అధిక శబ్దాల వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. 80 డెసిబుల్స్ దాటితే గుండెపై ప్రభావం పడుతుంది. డీజే భారీ శబ్దాల వల్ల ఒత్తిడి, బీపీ, గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా పెరుగుతాయి. బాధితుల్లో అలజడి, గుండెదడ, తలనొప్పి మొదలవుతాయి. రక్తపోటు 200 దాకా పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్‌స్ట్రోక్‌తో మరణించే అవకాశముంది ప్రమాదం ఉంది. రక్తపోటుతో నరాలు దెబ్బతిని కొందరికి పక్షవాతం రావచ్చు. పుట్టుకతోనే గుండె వ్యాధులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు, స్టెంట్‌లు వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అలాంటివారు చెవుల్లో దూది పెట్టుకోవాలి. శబ్దాల నుంచి దూరంగా వెళ్లడం, ఇంటి తలుపులు మూయడం మంచిది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు డీజేలు, భారీ శబ్దాలకు దూరంగా ఉంటే బెటర్.
COMMENTS