NATURAL WAYS TO REDUCE MICROPLASTIC
చాపకింద నీరులా శరీరంలోకి చేరుతోన్న "మైక్రోప్లాస్టిక్" - ఈ అలవాట్లతో ముప్పు తగ్గించుకోవచ్చట!!
How to Reduce Microplastic Intake : ప్రస్తుత కాలంలో మనం తాగే నీళ్ల సీసా నుంచి తినే ప్లేట్ వరకు దాదాపు అన్నీ ప్లాస్టిక్‌తో తయారైనవే ఉంటున్నాయి. ప్లాస్టిక్ గ్లాసులు, బాటిళ్లు, ప్లేట్లు, డబ్బాలు చౌకగా ఎక్కడైనా లభించడంతో చాలా మంది జనాలు వీటి వాడకాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. అయితే, రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న ప్లాస్టిక్ వ్యర్థ్యాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవాళికి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాలు మొదలు మహాసముద్రాల్లోనూ పెరిగిపోతోన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు కలిగించనున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఇప్పటికే పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలో మైక్రోప్లాస్టిక్ రూపంలో చేరిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల సంతానోత్పత్తి తగ్గడంతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందట! అయితే, మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ చేరకుండా నియంత్రించుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన (శాన్ ఫ్రాన్సిస్కో పర్నాసస్ క్యాంపస్) మహిళల ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ ట్రేసీ వుడ్‌రఫ్ (Tracey Woodruff) చెబుతున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆహార పదార్థాలను..
ఈ రోజుల్లో ఎక్కువ మంది నీటిని తాగడానికి ప్లాస్టిక్ బాటిళ్లు, తినడానికి అవే ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అధిక శాతం మైక్రోప్లాస్టిక్ మన శరీరంలోకి చేరిపోతుంది. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కణాలు కరిగి పదార్థాల్లో కలిసిపోతాయి. ఆ ఫుడ్‌ని తిన్నప్పుడు మన శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ చేరిపోతుంది. కాబట్టి, వీలైనంత వరకు నీటిని తాగడానికి గ్లాసు, స్టెయిల్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించమంటున్నారు. అలాగే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో తినడానికి ప్రాధాన్యం ఇవ్వమని.. డిస్పోసబుల్ ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు.
ప్యాక్ చేసిన ఫుడ్‌కి దూరంగా ఉండండి:
దాదాపు బయట హోటళ్లు, రెస్టారెంట్లలో అన్ని ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం కోసం ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలను ఉపయోగిస్తున్నారు. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కరిగి మైక్రోప్లాస్టిక్ రూపంలో ఫుడ్‌లో చేరుతుంది. కాబట్టి, వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను తినడానికే ప్రయత్నం చేయమంటున్నారు.
బ్యూటీ ప్రొడక్ట్స్..
కొన్ని రకాల కాస్మెటిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల కూడా మైక్రోప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, మీరు కొనే ప్రతి కాస్మెటిక్ ఉత్పత్తి లేబెల్‌ను జాగ్రత్తగా చదవండి. "మైక్రోబీడ్స్" లేదా "ప్లాస్టిక్ మైక్రోబీడ్స్" అనే పదాలు లేదా ఇతర ప్లాస్టిక్ పదార్థాల పేర్లు ఉంటే ఆ ప్రొడక్ట్‌కి దూరంగా ఉండమంటున్నారు. నేచురల్ షాంపూలు, ఫేస్ వాష్లను వాడమని సలహా ఇస్తున్నారు.
మరికొన్ని..
కాటన్, లెనిన్, ఉన్ని వంటి సహజ ఫైబర్‌లతో తయారు చేసిన దుస్తులను ఎంపిక చేసుకోండి.
పాలియెస్టర్, నైలాన్ వంటి సింథటిక్ ఫైబర్‌లతో చేసిన దుస్తులను తక్కువగా ఉపయోగించండి.
వాషింగ్ మెషీన్‌లో దుస్తులను తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాష్ చేయండి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉతికేటప్పుడు మైక్రోప్లాస్టిక్‌లు వేగంగా విడుదలవుతాయి.
మైక్రోఫైబర్స్ తొలగించే లాండ్రీ బ్యాగ్స్ లేదా ఫిల్టర్స్ వాడండి. దీనివల్ల వాటర్లోకి మైక్రోఫైబర్ చేరకుండా ఉంటుంది. ఫలితంగా వాటర్ కలుషితం కాకుండా చూసుకోవచ్చు.
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. HEPA (High-Efficiency Particulate Air) ఫిల్టర్‌తో కూడిన వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి. ఇవి మైక్రోప్లాస్టిక్ కణాలను కూడా పట్టుకోగలవు.
ఆహార పదార్థాలను ఓవెన్లో హీట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. వీటికి బదులుగా సిరామిక్‌తో చేసినవి ఉపయోగించాలి.
ఇంట్లో రివర్స్ అస్మోసిస్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ గుణాలు కలిగిన నాణ్యమైన వాటర్ ఫిల్టర్ వాడండి.
ఈ టిప్స్ పాటించడం ద్వారా శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ చేరకుండా నియంత్రించుకోవచ్చని డాక్టర్ ట్రేసీ వుడ్‌రఫ్ చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS