A village without people for 60 years.. Why do you know..?
60 ఏళ్లుగా మనుషులు లేని గ్రామం.. ఎందుకో తెల్సా..?
ఆ ఊరికి వెళితే చనిపోతారా? అందుకే అక్కడ మనుషులు ఉండడం లేదా? ఇంతకీ అక్కడేమైనా దెయ్యాలు తిరుగుతున్నాయా? ఆ ఊళ్లో మనుషులు ఉండకపోవడానికి కారణం ఏంటి?.. ఈ వింత గ్రామం గురించి తెలుసుకుందాం పదండి....
ఒకటి కాదు రెండు కాదు 60 ఏళ్లుగా ఆ ఊరిలో మనుషులెవరూ నివసించడం లేదు. అక్కడికి వెళ్లాలంటేనే భయపడతారు. ఇక అక్కడ నివసించాలంటే జనం దడుచుకుంటారు. చెప్పాలంటే అదో శాపగ్రస్త గ్రామం. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉంది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల గుహల్లో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది.
రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు వ్యాధితో ఈ ఊళ్లో వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూ ఉండడంతో ప్రజలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు. తర్వాత బందిపోట్ల దాడుల్లో గ్రామస్తులు కొందరు చనిపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో మరికొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడడంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పట్నుంచి దీన్ని దెయ్యాల గ్రామంగా పిలుస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు. 2008లో జేమ్స్ బాండ్ సిరీస్‌లో భాగంగా క్వాంటమ్ ఆఫ్ సొలేస్ చిత్రీకరణ కోసం ఈ ఊరిని వినియోగించడంతో విపరీతంగా పాపులారిటీ వచ్చింది.
COMMENTS