'The stage of the schools here is going to turn with the entry of the tatas!'
'టాటాల ఎంట్రీతో ఇక్కడ చదివేవారి దశ తిరగబోతోంది!'
ATCs in Telangana: ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్కిల్స్ ఉంటేనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఆదరణ కోల్పోయిన ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. వాటిని అధునాతన సాంకేతిక కేంద్రాలు ఏటీసీ(అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్స్) లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టే ఆరు కోర్సులకు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నైపుణ్య లేమితో అవకాశాలు దక్కని విద్యార్థులకు ఈ కేంద్రాలు బాసటగా నిలిచి మంచి జీతంతో ఉద్యోగాలు కల్పించనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 65 ఐటీఐల్లో పెద్దపల్లి, రామగుండం పారిశ్రామిక శిక్షణ కేంద్రాలకు చోటు దక్కింది. దీంతో తొలివిడతలోనే విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఆరు ఆధునిక కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా అడ్మిషన్ల గడువును పెంచినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్షకోయ ప్రకటించారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధిని పెంచే కోర్సుల్లో విద్యార్థులు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానంగా ఆరు కోర్సులు :
- మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమెషిన్
- ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్
- ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్
- బేసిక్ డిజైనర్ అండ్ వెరిఫైర్
- అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మిషనింగ్ టెక్నీషియన్
- మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ కోర్సుల్లో ఈ ఏడాది నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ తదితర కోర్సుల్లో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.
మారుతున్న కాలంతో ప్రస్తుతమున్న ఐటీఐ కోర్సులకు డిమాండ్ లేకుండా పోవడంతో విద్యార్దుల్లో నైరాశ్యం చోటు చేసుకొంటోంది. కనీసం పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేస్తే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. అదే ఐటీఐ కోర్సుతో ఉన్నత చదువుకు అవకాశం లేకపోగా ఉపాధి అవకాశాలు కొరవడుతున్నాయి. అందువల్ల ఆధునిక సాంకేతిక కోర్సులతో విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు అందనున్నాయని అంతేకాకుండా కచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని కలెక్టర్ చెప్పారు.
కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు:
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందనుంది. ప్రస్తుతం టాటా కంపెనీ ఆరేళ్ల వరకు కోర్సు నిర్వహణ బాధ్యత తీసుకుంది. తర్వాత గడువు పొడిగించనున్నారు. కోర్సు పూర్తి చేసిన వెంటనే అప్రెంటిస్‌షిప్ కల్పిస్తారు. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ(ఏఐ)కు ఆదరణ కనిపిస్తున్న నేపథ్యంలో ఐటీఐల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.
టాటా, ప్రభుత్వ ఓప్పందం:
అధునాతన సాంకేతిక కేంద్రాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పెద్దపల్లి ఐటీఐ ఆవరణలో రూ.4 కోట్ల 77 లక్షలతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కోర్సులకు సంబంధించిన యంత్రాలు వచ్చాయి. మిగిలినవి కూడా త్వరలో రానున్నాయి. ఇప్పటికే ఐటీఐలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా కొత్త కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని కలెక్టర్ సూచించారు.
కొత్తగా ప్రవేశపెట్టిన ఆరు కోర్సులతో విద్యార్థుల్లో మెరుగైన నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. శిక్షణ పూర్తి చేస్తే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు దొరుకుతాయని. ఆరు కోర్సుల్లో మొత్తం 172 సీట్లకు అనుమతి ఉందని వివరిస్తున్నారు. చదువుతో పాటు నైపుణ్యాన్ని కల్పించే దిశగా కొత్త కోర్సులు అందుబాటులో రావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు దృష్టి సారిస్తే ప్రయోజనం కలుగుతుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
COMMENTS