Success Story: Studied in 10th grade. A person who earned crores from their cultivation
Success Story: చదివింది 10వ తరగతే.. వాటి సాగుతో కోట్లు సంపాదించిన వ్యక్తి, సీక్రెట్ సక్సెస్ స్టోరీ..
Lohit Shetty Success: కొన్ని సంవత్సరాల కిందట వ్యవసాయం వృధా అంటూ రైతన్నను చిన్నచూపు చూసిన సంగతి తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్లిందంటే కేవం ఐటీ కంపెనీలో లక్షల ప్యాకేజీ ఉంటేనే జాబ్ అనే స్థాయికి భారతదేశంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొందరు మాత్రం దీనిని పూర్తిగా మార్చేస్తున్నారు. సాగులో ప్రత్యేక కృషితో సొంత గ్రామాల్లోనే ప్రశాంత వాతావరణంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తూ కోటీశ్వరులుగా మారుతున్నారు. అవునండీ బాబు పచ్చని పొలాల నుంచి పచ్చ కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న రైతన్న సెక్సెస్ స్టోరీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. చిన్నతనంలో అందరిమాదిరిగానే అనేక ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతి తర్వాత కొనసాగించలేదు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఆదాయాన్ని పెంచే పనిలో నిమగ్నమయ్యాడు లోహిత్. ఈ క్రమంలోనే చిన్న దుకాణం నుంచి రెస్టారెంట్ వరకు వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు. కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో క్వారీలో ఉద్యోగం సంపాదించాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పనిచేశాడు.
ఈ సమయంలో లోహిత్ రాంబుటాన్, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్ వంటి విదేశీ పండ్ల రకల సాగుపై శిక్షణ పొందాడు. ఈ క్రమంలో గ్రహించిన అనేక విషయాలతో కుటుంబ ఎదుగుదల వచ్చినట్లు లోహిత్ చెప్పారు. సాగులో అన్ని విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత 2016లో ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే తన నైపుణ్యాలను లాభదాయకమైన వ్యాపారంగా మార్చేందుకు తాను సైతం రాంబూటాన్, మామిడికాయ, డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం కుటుంబానికి చెందిన 21 ఎకరాలతో పాటు మరో 20 ఎకాల భూమిని కౌలుకు తీసుకున్నారు. కేరళలోని నర్సరీ నుంచి మరిన్ని మొక్కలను సేకరించాడు.
ప్రస్తుతం లోహిత్ పంటలు మరియు కూరగాయలు పండించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులకు కూడా సహాయం చేస్తున్నాడు. ఈ వెంచర్ల ద్వారా ఏటా రూ.కోటికి పైగా సంపాదిస్తున్నాడు. ఒక రాంబుటాన్ మొక్క సంవత్సరానికి 45 కిలోలు, డ్రాగన్ ఫ్రూట్ మొక్క సంవత్సరానికి 300 పండ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే లోహిత్ 12 ఎకరాల భూమిలో రాంబుటాన్ పండిస్తూ 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో రంబుటాన్ కిలో రూ.180-300, మామిడికాయ కిలో రూ.350 -750, డ్రాగన్ ఫ్రూట్ రూ.100-150కి విక్రయిస్తూ భారీ లాభాలను అందుకుంటున్నాడు. మంచి దిగుబడి కోసం లోహిత్ గో ఆధారిత ఎరువులను వినియోగిస్తూ, బిందు సేద్యం పద్దతులను అవలంబిస్తున్నాడు.
ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, ముంబై, కేరళలోని వినియోగదారులకు నేరుగా తన వ్యవసాయ క్షేత్రం నుంచే పండ్లను సరఫరా చేస్తున్నారు. జీవితంలో విజయం సాధించటానికి పట్టుదల ఉంటే సరిపోతుందని లోహిత్ సక్సెస్ చెబుతోంది. ప్రకృతిని అర్థం చేసుకుంటూ తోటలను సాగు చేయటంలో పట్టు సాధించి భారీగా లాభాలను పొందుతున్నాడు.
COMMENTS