Starting with one piece. Eating the whole thing?
ఒక్క పీస్తో మొదలు పెట్టి.. మొత్తం తినేస్తున్నారా? - కోరిక ఆపుకోలేక పోతున్నారా? - దానికి కారణం ఇదేనట!
Reasons Behind Non Stop Eating : మీరు పిజ్జాను చూశారు.. అన్ హెల్దీ అని మనసు చెప్తున్నప్పటికీ నోరు ఊరుతోందని ఒక్క పీస్ తీసుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఆపుకోలేక మరో ముక్క తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకోటి.. చివరగా మరోటి.. ఇలా దాన్ని పూర్తిగా తినేస్తారు. ఈ విధంగా కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. ఐస్‌క్రీం, బిస్కట్లు తిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఒకదానితో ఆపబుద్ధి కాదు. మరి.. ఎందుకిలా? కొన్ని ఫుడ్స్‌ని తినేటప్పుడు వాటిని ఆపకుండా తినాలనిపిస్తుంది ఎందుకు? అందుకు గల కారణాలేంటి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టేస్టీగా ఉండే ఫుడ్ ముక్క తినప్పుడు సెరటోనిన్ అనే హార్మోన్ విడుదలై.. 'బాగుంది ఇంకా తిను' అనే సందేశాన్ని బ్రెయిన్‌కి అందిస్తుందట. దాంతో మనం ఆపకుండా తింటూనే ఉంటామంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదే అంశం వెనుక దాగి ఉన్న అసలు విషయం తెలుసుకోవడానికి జర్మనీలోని బాన్, యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల వాళ్లు సంయుక్తంగా ఓ పరిశోధన చేపట్టారు. అలా తినడం వెనుక దాగి ఉన్న కొన్ని కారణాలను గుర్తించారు.
ముఖ్యంగా మనం పెద్దగా నమలాల్సిన అవసరంలేకుండా నేరుగా మింగేయగల నోరూరించే పదార్థాలను తినేటప్పుడు ఇలా ఆపకుండా ఎక్కువగా తినాలనిపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎందుకంటే.. అలాంటి పదార్థాలను తినేటప్పుడు అన్నవాహికలో ఉండే కొన్ని నాడీకణాలు ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడుతాయట. అప్పుడు ఆ నెట్వర్క్ మెదడుని ‘ఇంకా కావాలంటూ’ ప్రేరేపిస్తాయట. ఫలితంగా మనలో సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందట. దాంతో అదుపులేకుండా తింటూనే ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా తింటే మంచిదట!
ఆహారాన్ని నిదానంగా కొద్ది కొద్దిగా తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అదే మీరు హడావుడిగా తింటే ఆకలి తీరింది అన్న సంకేతాలు మెదడుకు చేరవు. దాంతో ఎక్కువగా తినాల్సి వస్తుంది. కాబట్టి.. నిదానంగా తినడం వల్ల సంతృప్తి కలుగుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుందంటున్నారు. ఇకపోతే కొందరు.. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడూ ఆహారాన్ని పరిష్కారంగా భావిస్తుంటారు. దీనిని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అలాంటి మానసిక పరిస్థితి ఉంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అలాగే.. ఏ ఆహారాన్ని అయినా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS