If a girl child is born, Rs.5 thousand, wedding gifts, and many more offers - do you know somewhere!
ఆడపిల్ల పుడితే రూ.5వేలు, పెళ్లికానుకలు, ఇంకా ఎన్నో ఆఫర్లు - ఎక్కడో తెలుసా!
Sarpanch Elections in TG : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు, నోటిఫికేషన్ రాలేదు కానీ ఇప్పటి నుంచే ఊళ్లలో ఎన్నికల సందడి మొదలవుతోంది. ఇప్పటి నుంచి ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని అభ్యర్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఇలాగే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కొడారి లత మల్లేష్ అనే మహిళ భారీ ఆఫర్లతో ఏకంగా భారీ మేనిఫెస్టో విడుదల చేసింది.
ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపుతాం అంటూ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామంలో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇచ్చే హామీల వలె ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి ప్రజలను తమకు ఓటు వేసి గెలిపించాలని వినూత్నంగా కోరుతోంది కొడారి లత.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు : ఆడపిల్ల పుడితే రూ. 5 వేలు, ఇంట్లో ఎవరైనా మరణిస్తే కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సాయం, ఆడపడుచు పెళ్లి కానుక, నిరుద్యోగులకు, మహిళలకు కుట్టు మిషన్లు, ఇంటి పన్ను ఉచితం, ఇంకా రక్షిత మంచినీరు, విద్య, వైద్యం, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్, ఒంటరి మహిళలకు, వృద్ధులకు నివాస వసతి గృహం వంటి వాటిని 14 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఒక్క అడుగు ముందుకు పంపిస్తే పది తరాలకు గుర్తుండే విధంగా అభివృద్ధి చేస్తానంటూ గ్రామస్థులను కోరుతోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్కాపురం గ్రామ సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే ఇప్పుడు ప్రకటించిన 14 హామీలను అమలు చేస్తాను. ఎవరైనా మరణిస్తే రూ. 20 వేల ఆర్థిక సహాయం, మంచి నీరు ఉచితం, ఆడపిల్ల జన్మిస్తే రూ. 5 వేలు, ఆడపడుచులకు కుట్టు మిషన్లు, గ్రంథాలయాల ఏర్పాటు చేపడతాం -కొడారి లత మల్లేష్, సర్పంచ్‌గా పోటీ చేసే మహిళ
కొడారి లత భర్త మహేష్ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తునే మూడున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. లత మహేష్ ఇచ్చిన హామీలను చూసి మల్కాపూరం గ్రామస్థులు ఆమెను సర్పంచ్‌గా గెలిపిస్తారో లేదో చూడాల్సి ఉంది.
COMMENTS