If you leave it as hundreds. They are withdrawing thousands of crores
వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు.
మే 22, 2024 బెంగళూరులోని ఈస్ట్ రామమూర్తినగర్ బాధితురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్‌కి కోటి రూపాయల నష్టం. కొరియర్ వచ్చిందంటూ ఫెడ్ ఎక్స్ తరపున ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ పేరున తైవాన్ వెళ్లాల్సిన ఓ కొరియర్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. అక్కడితో ఆగితో ఈ కథలో పెద్ద కిక్కు లేదు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. అక్కడ నుంచి కథ కస్టమ్స్‌కి మారింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ మరి కొందరు ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. పార్శిల్‌లో డ్రగ్స్‌తో పాటు పాస్ట్ పోర్టులు, ఇతర వస్తువులు ఉన్నాయని, ఆల్రెడీ విచారణ మొదలైందంటూ భయపెట్టారు. అక్కడితో ఆగలేదు. మరొకరు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్ లైన్లో ఇంటరాగేషన్ పేరుతో భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌కు సపోర్ట్ చెయ్యాలని, అందుకోసం ఆర్బీఐకి కొంత డబ్బు పంపాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి విడతల వారీగా కోటీ రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతే సడన్‌గా కాల్ కట్టయ్యింది. విచారణ పూర్తయ్యింది. అక్కడితో వారి క్రైం కథా చిత్రం కూడా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కోటి రూపాయలు ఇచ్చేసిన తర్వాత కానీ ఆమెకు తాను మోసపోయానన్న సంగతి తెలియలేదు. ఆ తర్వాత లబో దిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.
బెంగళూరు వరకు ఎందుకు…?
కొద్ది రోజుల క్రితం వైజాగ్‌లోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మీకు లాటరీ తగిలిందనగానే లింక్ క్లిక్ చేశారు.లాటరీ మాట దేవుడెరుగు.. ఖాతాలో ఉన్న కాస్త డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి.
మొత్తంగా వైజాగ్, బెంగళూరు అనే కాదు… దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 5 సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. అంటే రోజూ నమోదవుతున్న సైబర్ క్రైం ఫిర్యాదుల సంఖ్య అక్షరాల ఏడు వేలు. ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.
తాజాగా నేషనల్ సైబర్ క్రైం రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజూ సుమారు ప్రజల నుంచి సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 67 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఒక్క 2024 తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1700 కోట్ల రూపాయల సైబర్ క్రైం మోసాలు దేశంలో జరిగాయి. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 70 వేల కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయట. అయితే ఈ నేరాల విలువ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నప్పటికీ… జరుగుతున్న నేరాల సంఖ్య విషయంలో మాత్రం పెద్దగా తేడాలు ఉండటం లేదు.
నిజానికి గతంలో సైబర్ నేరాల వల్ల ఏటా దేశంలో జరిగే నష్టం సుమారు 10 వేల కోట్లు ఉండేదని సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ చెబుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పటికీ దాని విలువ విషయంలో భిన్నాభిప్రాయాలుండటానికి ప్రధాన కారణం ఈ సెబర్ నేరాల్లో చాలా వరకు చిన్న మొత్తాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఫిర్యాదులు ఇచ్చే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. లా ఎన్ ఫోర్స్‌మెంట్ దృష్టిలో పడకుండా ఉండేందుకు స్కామర్స్ చిన్న చిన్న మొత్తాలపైనే ఎక్కువ స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఆ మోసాల గురించి ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప నేరుగా చట్టం చేతికి చిక్కడం లేదు.
ఎక్కువగా ఈ స్కామ్‌లు మియన్మార్, లావోస్, కాంబోడియా, చైనా దేశాల బేస్‌గా జరుగుతున్నాయి. ఇండియాలో కొందర్ని అపాయింట్ చేసుకొని వారిని ఎరలుగా వాడుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌కి మన దేశంలో బీహార్‌లోని నలంద జిల్లా చాలా ఫేమస్. అలాగే గడిచిన 8 ఏళ్లుగా జవా కటియా అనే గ్రామం కూడా సైబర్ క్రైం సెంటర్‌గా పేరుంది. ఇలా దొంగలించే సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. ఫలితంగా వాటిని ట్రాక్ చెయ్యడం కూడా సాధ్యం కావడం లేదు.
సైబర్ క్రైం ఎన్నిరకాలు ?
కొరియర్ స్కామ్‌లు: దేశంలో ఇప్పుడు ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్ చాలా ఫేమస్. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ కాల్స్ రోజూ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. ఇందులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మీపై డ్రగ్స్, నార్కోటిక్స్ అభియోగాలు ఉన్నాయని.. ఇలా ఏదో ఒక పేరుతో బెదిరించి డబ్బులు గుంజేస్తుంటారు. ఈ కథనం ప్రారంభంలో ప్రస్తావించిన బెంగళూరు యువతి ఘటన అందుకు ఉదాహరణ.
జాబ్ స్కామ్స్: భారీ జీతాలతో ఉద్యోగాలిస్తామని, అందుకు ముందుగా కొంత ఫీ చెల్లిస్తే చాలంటూ వచ్చే కాల్స్ ఈ తరహావి. వారు చెప్పే భారీ జీతానికి ఆశపడి ఫీజు చెల్లించారో మీ పని అయిపోయినట్టే.
ఇన్వెస్టిమెంట్ స్కామ్స్: ఇందులో బాధితుల్ని సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత ఓ నకిలీ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే మిమ్మల్ని ఒప్పిస్తారు. ఇలాంటివి సాధారణంగా క్రిప్టో మోసాలు క్యాటగిరిలో ఉంటాయి.
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించేద్దాం.. అని ఇంటర్నెట్‌లో ఈ తరహా వెతికే వారు ఈజీగా ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. వాళ్ల డేటాను సేకరించి వాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే వీళ్లు ఎప్పుడూ ఒకే లోకేషన్‌లో ఉండరు. అలాగే నలుగురుగైదురు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉంటూ ఉంటారు కూడా. పని పూర్తయ్యాక.. వాళ్ల ఆచూకీ, ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేస్తారు. నిజానికి ఇలాంటి విషయాల్లో ఫిర్యాదులిచ్చినా చాలా వరకు దాని ఎంక్వైరీకి అయ్యే ఖర్చుతో పోల్చితే బాధితుడికి జరిగే నష్టం అతి తక్కువ కావడంతో చిన్న చిన్న మొత్తాల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. అలాగే చిన్న మొత్తంలో నష్టపోయినప్పుడు బాధితులు కూడా దాని కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, పోలీసుల చుట్టూ ఎవడు తిరుగుతాడులే అని వదిలేస్తున్నారు కూడా. కానీ ఈ చిన్న చిన్న మొత్తాలే వందల, వేల కోట్ల ఆదాయంగా మారుతోంది ఈ తరహా స్కామర్లకు.
పదో స్థానంలో ఇండియా
ప్రపంచంలో సైబర్ క్రైం నేరాల బారిన పడుతున్న దేశాలలో ఇండియా పదో స్థానంలో ఉంది. దీంతో ఈ తరహా మోసాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి లాంచ్ చేసిన సస్పెక్ట్ రిజస్ట్రీ ప్రకారం దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలలో సుమారు 14 లక్షల మంది క్రిమినల్స్ భాగస్వాములై ఉన్నారని తేలింది. ఈ సస్పెక్స్ట్ రిజస్ట్రీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ ఇన్విస్టిగేషన్, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు వినియోగించుకోవచ్చు. దీనిని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ రూపొందించింది.
సైబర్ మోసాలకు గురయ్యే వారు గోల్డెన్ అవర్‌లో అంటే బ్యాంక్ నుంచి మోసగాళ్లు మీ డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకునే తొలి గంటలో 1930కి కాల్ చెయ్యాలి, లేదా WWW.cybercrime.gov.inలో ఫిర్యాదు చెయ్యాలి. అలా చేస్తే వెంటనే మీ డబ్బుల్ని వారి ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చెయ్యచ్చు. అలా 2021 నుంచి ఇప్పటి వరకు NCRP సుమారు 2800 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. తద్వారా సుమారు 8లక్షల50వేల మంది బాధితులకు మేలు జరిగింది. NCRP ప్రకారం దేశంలో ఇప్పటి వరకు సుమారు 47.8 లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు అందాయి.
దేశంలో పెరిగిపోతున్న సైబర్ క్రైం నేరాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 5 వేల మంది సైబర్ కమాండోలను వచ్చే ఐదేళ్లలో నియమిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ప్రకటించారు. నేరం జరిగిన వెంటనే వీరు రెస్పాండ్ అవుతారని చెప్పారు. అలాగే ఇకపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ హోం మినిస్ట్రీ ఆధ్వర్యంలో పని చేయనుంది.
సర్కారు ప్రయత్నాలు సరే.. మన సంగతేంటి.. సైబర్ నేరాల బారిన పడకుండా మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం.
1.గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ , ఈమెయిల్స్, మెసేజ్‌ల జోలికి వెళ్లకండి
2.అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల్లోని లింకులు, అటాచ్మెంట్స్ క్లిక్ చెయ్యద్దు.
3.ఆఫర్ల పేరుతో వచ్చే కాల్స్ విషయంలో అనవసరంగా తొందరపడి అనర్ధాలు తెచ్చుకోవద్దు.
4.డబ్బులు పంపేటప్పుడు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేటప్పుడు సదరు కంపెనీ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్లలలో కొన్ని యాప్స్ కాల్ లాగ్స్‌ని, కెమెరాను , మైక్రోఫన్ యాక్సిస్ అడుగుతాయి. వాటికి ఓకే చెప్పేటప్పుడు తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి.
5.మీ ఆన్ లైన్ అకౌంట్లకు కఠినమైన పాస్ వర్డ్స్‌ను ఏర్పాటు చేసుకోండి. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్‌ను కచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి.
6.మీ మొబైల్, ల్యాప్ ట్యాప్ సాప్ట్ వేర్ అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోండి.
7. ఎప్పటికప్పుడు సైబర్ క్రైం విషయంలో వస్తున్న వార్తల్ని, వారి మోడస్ ఆపరెండీని గమనిస్తూ ఉండండి. భవిష్యత్తులో మీకు కూడా అదే తరహా కాల్స్, లేదా మెసేజెస్ లేదా మెయిల్స్ రావచ్చు. మీరు అనుకోకుండానే వాటిని క్లిక్ చేసే ప్రమాదం కూడా ఉంది.
8.గాడ్జెట్స్ వాడకంలో స్మార్ట్‌గా మాత్రమే కాదు… కేర్‌ఫుల్‌గా కూడా ఉండండి.
COMMENTS