Biryani is being cooked as 'mother' - a transgender team success story in the catering business
'అమ్మ'గా బిర్యానీ వండి పెడుతున్నారు- క్యాటరింగ్ బిజినెస్‌లో ట్రాన్స్‌జెండర్ టీమ్ సెక్సెస్ స్టోరీ.
Transgender Catering Business In Tamilnadu : ట్రాన్స్జెండర్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు. ఛీత్కారాలు! చాలా మంది కుటంబ సభ్యుల ఆదరణకూ నోచుకోరు! అయితే ఇలాంటి అవమానాలు, అవాంతరాలు అన్నింటినీ దాటుకుని తన కాళ్ల మీద తాను నిలబడమే కాకుండా, తనలాంటి వాళ్లను ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేలా చేస్తోంది ఓ ట్రాన్స్‌జెండర్. ఆమే క్యాటరింగ్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న 'సెల్వీ అమ్మ'. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సెల్వీ, ఆమెతో నడిచిన 40మంది ట్రాన్స్జెండర్ల టీమ్ వారి అనుభవాలను "ఈటీవీ భారత్"తో షేర్ చేసుకున్నారు.
'అమ్మ'గా వండి పెడుతోంది:
కోయంబత్తూరుకు చెందిన సెల్వీ(50) అనే ట్రాన్స్‌జెండర్ క్యాటరింగ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. అందరితో 'సెల్వీ అమ్మ' అనిపించుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఈ విజయం సెల్వీకి అంత సులువుగా దక్కలేదు. తాను కూడా అందరు ట్రాన్స్జెండర్ల లాగానే అనేక సవాళ్లను ఎదుర్కొంది. సమాజంలో తమలాంటి వారిపై ఉన్న చిన్నచూపు, ఛీత్కారాలను దాటి, తాను కూడా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్టపడింది. ఈ క్రమంలో వంటల్లో, ముఖ్యంగా బిర్యానీ చేయడంలో మెలకువలు నేర్చుకుని ఆరితేరింది. అందులో ముఖ్యంగా సెల్వీ అమ్మ చేసే, 'రవ్తర్' బిర్యానీ చాలా ఫేమస్. ఫలితంగా, పొరుగు రాష్ట్రం కేరళ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది తమ ఇంటి కార్యక్రమాల కోసం సెల్వీ అమ్మ చేత వంట చేయించుకోవడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
తనలాంటి వారిని చేరదీసి:
స్వతహాగా ట్రాన్స్జెండర్ల కష్టాలను అనుభవించింది సెల్వీ. అయితే తనలాంటి వారికి సహాయపడాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆమె చేసిన పని చాలా మంది ట్రాన్స్జెండర్లకు ఓ దిక్సూచి అయింది. నిరుద్యోగ ట్రాన్స్జెండర్లను చేరదీసి, కనీసం టీ పెట్టడం రాని వారికి కూడా వంటల్లో మెలకువలు నేర్పింది. అలా ఒక్కొక్కరుగా సెల్వీ అమ్మ టీమ్‌లో భాగస్వాములయ్యారు. ఇప్పుడు సెల్వీ క్యాటరింగ్ టీమ్‌లో 40మంది ఉన్నారు.
'ఆత్మవిశ్వాసం నింపింది':
సెల్వీ అమ్మ టీమ్‌లోని కనిక అనే ట్రాన్స్‌జెండర్ తన అనుభవాలను "ఈటీవీ భారత్"తో షేర్ చేసుకుంది." సెల్వీ అమ్మ/సరో అమ్మ దగ్గర వంట నేర్చుకున్న తర్వాత మేము చాలా చోట్ల వంటలు చేస్తున్నాము. కోయంబత్తూరులోనే కాకుండా కేరళలోనూ బిర్యానీ చేస్తున్నాము. నాలాంటి వారికి వంట నేర్పించి మాలో ఆత్మవిశ్వాసం నింపింది సెల్వీ అమ్మ. నేను దాదాపు 15ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మేము చేసే 'రవ్తర్' బిర్యానీ కోయంబత్తూరులో చాలా ఫేమస్. అయితే మాకు ఇక్కడి కంటే కేరళలోనే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. గత వారం మా టీమ్, ఓ పండుగ సందర్భంగా వేయి మందికి బిర్యానీ చేసింది. ఒకప్పుడు మాకు టీ ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మేము వేల మందికి కూడా వండి పెట్టగలం" అని కనిక తెలిపింది.
నిరుద్యోగికి చేయూత:
తాను నిరుద్యోగిగా ఉన్నప్పుడు సెల్వీ అమ్మ మంచి గైడెన్స్ ఇచ్చారని వినిత అనే మరో ట్రాన్స్‌జెండర్ తెలిపింది. తాను సెల్వీ అమ్మ టీమ్‌లో గత రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నట్లు చెప్పింది. తాను బిర్యానీ మాస్టర్‌గా అయిన తర్వాత, అందరూ మెచ్చే బిర్యానీ చేయబోతున్నానని సంతోషం వ్యక్తం చేసింది.
COMMENTS