60 lakhs stolen from ATMs! The accused died in the cinematic chase-encounter of the police!
ATMల నుంచి రూ.60లక్షలు చోరీ! పోలీసుల సినిమాటిక్ ఛేజ్- ఎన్కౌంటర్లో నిందితుడు మృతి!!
Tamilnadu Police Chase ATM Heist : అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ కంటైనర్ లారీని తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించారు.
సినిమాటిక్ ఛేజ్:
కేరళ త్రిస్సూర్‌లోని షొర్నూర్ రోడ్, కోలాజీ, మప్రాణంలోని ఎస్బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దాదాపు రూ.60 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీకి పాల్పడిన దొంగలుగా భావిస్తున్న కొందరు ఓ కంటైనర్ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కంటైనర్‌ను ఛేజ్ చేశారు. మొదటగా డ్రైవర్‌కు లారీని ఆపాలని చెప్పారు. కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు.
అనంతరం లారీని అడ్డగించిన పోలీసులపైకి, దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ నిందితుడిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతడు మృతి చెందాడు. మరో ఆరుగురిలో కొంతమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, ఈ ఆపరేషన్‌లో గాయపడిన పోలీసు అధికారులు ఇన్స్పెక్టర్ తవమణి, ఎస్ఐ రంజిత్‌ను ఆస్పత్రికి తరలించారు. లారీలో దాచిన ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠా రాజస్థాన్, హరయాణాకు చెందినదిగా పోలీసుల భావిస్తున్నారు.
హైవేపై ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్!
గతేడాది దిల్లీ-మంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై సినీ ఫక్కీలో లారీని ఛేజ్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 32 ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని 20 కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకన్నారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లో జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న లారీని గుర్తించి, గో రక్షక దళం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లారీని వెంబడించారు. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లు వేగం పెంచారు. ఘమ్డోజ్ టోల్‌ప్లాజా వద్ద బ్యారియర్‌ను ఢీకొట్టి ఆగకుండా లారీని పరిగెత్తించారు. కారులో లారీని వెంబడిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రోడ్డుపై మేకులు చల్లారు. దీంతో లారీ ముందు టైరు ఒకటి పంక్చర్ అయింది. కొద్ది సేపటి తర్వాత రిమ్ నుంచి టైరు విడిపోయింది. అయినా రిమ్పై లారీ దూసుకెళ్లింది. హైవేపై 20 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు బోంద్సీ ప్రాంతంలో లారీని అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల సూపర్ ఛేజింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
COMMENTS