Center changed Sukanya Samriddhi rules - account closed if not done!
సుకన్య సమృద్ధి రూల్స్ మార్చిన కేంద్రం - ఇలా చేయకుంటే అకౌంట్ క్లోజ్!
Sukanya Samriddhi Yojana New Rules: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో "సుకన్య సమృద్ధి యోజన" ప్రజల నుంచి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆడపిల్లలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఇది. అయితే తాజాగా కేంద్రం.. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇంతకీ మారిన రూల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం.. 2015లో ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. "బేటీ బచావో.. బేటీ పడావో" ఇనిషియేటివ్‌లో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల పై చదువులు, వివాహానికి అయ్యే ఖర్చులు తీర్చే ఉద్దేశంతో.. వారి తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం. పోస్టాఫీస్ పథకాల్లో అన్నింటికంటే ఎక్కువ వడ్డీ రేటు ఇందులోనే 8.20 శాతంగా ఉంది. పదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి. వరుసగా 15 సంవత్సరాలు.. ఏటా కనిష్ఠంగా రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
మారిన రూల్స్ చూస్తే: నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ కింద సుకన్య సమృద్ధితో పాటు పీపీఎఫ్ వంటి ఇతర సక్రమంగా తెరిచిన ఖాతాల్ని క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. అకౌంట్ ఓపెనింగ్‌లలో వ్యత్యాసాలను సరిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైన అప్‌డేట్‌లలో ఒకటి గ్రాండ్ పేరెంట్స్ తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాలకు సంబంధించినది.
అంటే.. గతంలో ఆడపిల్లల తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇతరులు కూడా సంరక్షకులు కాకపోయినా వారి ఆర్థిక భద్రత కోసం ఇలా అకౌంట్లు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షరులు కారు. చట్టపర సంరక్షకులు లేదా పిల్లల తల్లిదండ్రులు తెరవని సుకన్య సమృద్ధి అకౌంట్లు.. ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం.. తప్పనిసరిగా సంరక్షక బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. గ్రాండ్ పేరెంట్స్ వంటి వారి పేరుతో ఉన్న సుకన్య సమృద్ధి అకౌంట్లు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు లేని బాలికలకు వారి గ్రాండ్ పేరెంట్స్ సంరక్షకులగా ఉండాలనుకుంటే ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.
అకౌంట్ క్లోజ్, ట్రాన్స్‌ఫర్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు:
- SSY అకౌంట్ బుక్
- బాలిక బర్త్ సర్టిఫికెట్
- కొత్త గార్డియెన్ లేదా పేరెంట్స్ ఐడీ ప్రూఫ్
- ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ ఫారం
అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రాసెస్:
- పత్రాలన్నీ తీసుకుని ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి.
- కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి.
- బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌ను పూరించాలి.
- ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్‌పై సంతకం చేయాలి.
- ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు.
- ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్‌డేట్ అవుతాయి.
COMMENTS