Shopping online? Know the actual price of goods!
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? వస్తువుల అసలు ధర తెలుసుకోండిలా!
How To Calculate Product Actual Price : ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. టీవీ, మొబైల్ ఫోన్‌ల దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరకుల వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆఫర్ల సీజన్ కూడా వచ్చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు తమ బిగ్ సేల్స్ తేదీలను ఇప్పటికే ప్రకటించేశాయి. మరికొద్ది రోజుల్లో సేల్స్ కూడా మొదలుకానున్నాయి. ఇదే అవకాశంగా చాలా మంది తాము కొనాల్సిన ప్రోడక్టులను కార్ట్‌లో యాడ్ చేసుకుంటున్నారు. డీల్స్ మొదలవ్వడమే తరువాయి ఆర్డర్ పెట్టేందుకు సిద్ధంగా అయిపోతున్నారు. కానీ ఇక్కడే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ప్రైస్ హిస్టరీని తెలుసుకోవాల్సిందే!
ఇలాంటి సేల్స్ సమయంలో ఉత్పత్తులు తక్కువ ధరకు వస్తుంటాయని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ-కామర్స్ సంస్థలు కొన్ని వస్తువుల ధరలను సేల్‌కు ముందు బాగా పెంచేసి, తర్వాత తగ్గించినట్లు చూపిస్తుంటాయి. ఇది తెలియక ఆఫర్ సమయంలో తక్కువ ధరకు కొన్నట్లు కొందరు వినియోగదారులు ఆనందపడిపోతుంటారు. అందుకే మీరు కొనే వస్తువు అసలు ధర ఎంత? ఏ సమయంలో తక్కువ ధరకు విక్రయించారు? ప్రస్తుతం తగ్గింపుతోనే అమ్ముతున్నారా? లేదా? మొదలైన విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలియాలంటే వాటి ప్రైస్ హిస్టరీని పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
యాప్‌లోనే:
ఈ-కామర్స్ వైబ్‌సైట్ లేదా యాప్‌లోనే మీకు కావాల్సిన వస్తువు (ప్రోడక్ట్) ప్రైస్ హిస్టరీని చూడవచ్చు. దీని కోసం యాప్ బయటకు రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీ మొబైల్‌లో మొదట ప్రైస్ హిస్టరీ ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఏ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో అయినా మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ను ఓపెన్ చేసి పక్కనే ఉన్న షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంతకు ముందు ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ను ఎంచుకోవాలి. అంతే యాప్ నుంచి బయటకు రాకుండా అక్కడే ఓ పాప్-అప్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆ వస్తువుకు సంబంధించిన ప్రైస్ హిస్టరీ కనిపిస్తుంది.
ప్రోడక్ట్ ధరలు ఇలా?
గరిష్ఠ ధర, కనిష్ఠ ధర, ఎప్పుడెప్పుడు ఆ వస్తువు ధర తగ్గింది? ఇలా అన్ని విషయాలు అక్కడే ఓ ఛార్ట్‌లో అందులో కనిపిస్తాయి. రానున్న రోజుల్లో ఈ ప్రోడక్ట్ ధర తగ్గే అవకాశం ఉందా? అనే విషయం కూడా తెలిసిపోతుంది. ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఆ వస్తువు ధర ఎంత ఉందనేది కూడా సరిపోల్చి (COMPARE) ఈజీగా తెలుసుకోవచ్చు. ఫలానా వస్తువు ధర తగ్గిందని తెలుసుకునేందుకు అక్కడే అలర్ట్‌ను సెట్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ సాయంతో:
ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని వస్తువుల ప్రైస్ ఛార్ట్‌ను pricehistoryapp.comలో ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీకు కావాల్సిన వస్తువు లింక్‌ను ప్రైజ్ హిస్టరీ వెబ్‌సైట్‌లోని సెర్చ్ బార్‌లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే మీకు కావాల్సిన ప్రోడక్ట్ ధరలు వివరాలు అన్నీ అందులో కనిపిస్తాయి. వస్తువు ధర ఎప్పుడు ఎంత ఉందనే విషయం కూడా తెలుస్తుంది.
ఎక్స్ టెన్షన్ సాయంతో:
ఎక్స్‌టెన్షన్ సాయంతోనూ ప్రోడక్ట్ ప్రైస్ హిస్టరీని పరిశీలించవచ్చు. అమెజాన్‌లో అయితే keepa ఎక్స్‌టెన్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్‌ను ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే ఓ ఛార్ట్ కనిపిస్తుంది. అందులో ఏ రోజు ఎంతెంత ధర ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా?
ఒక వేళ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 'ప్రైజ్ హిస్టరీ' అనే ఎక్స్‌టెన్షన్‌ను మీ బ్రౌజర్‌కు యాడ్ చేయాలి. అచ్చం అమెజాన్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రైస్ ఛార్ట్ దర్శనమిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా వేరే వెబ్‌పేజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
COMMENTS