Shopping online? If you hurry, you will lose money - be careful!
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? తొందరపడితే డబ్బులు పోతాయ్ - జర జాగ్రత్త!
Psychological Traps Of Online Shopping : 'ఆలసించిన ఆశా భంగం, త్వరపడండి - మంచి తరుణం మించిన దొరకదు' అంటూ ఒకప్పుడు వ్యాపారులు ప్రజలకు వస్తువులను అంటగట్టేవారు. ఇప్పుడు ఇదే ట్రిక్కును ఈ-కామర్స్ వెబ్సైట్లు పాటిస్తున్నాయి. కానీ కాస్త స్టైలిష్ భాషలో - లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, ఫెస్టివ్ షేల్స్ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీనితో ప్రజలు కూడా ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా చేసేస్తున్నారు. ఒక వస్తువు మార్కెట్ ధర కంటే, చాలా తక్కువ ధరకు దానిని సొంతం చేసుకుంటున్నామనే భ్రమలో ఉంటున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని, ఆన్లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. స్పామ్ ఈ-మెయిళ్లు, మెసేజులు, లింకులు పంపిస్తూ ప్రజలను బురిటీ కొట్టిస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల బారిన పడకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బిగ్ ట్రాప్ : పండగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో, ఆన్లైన్లో ఎక్కడ చూసినా డిస్కౌంట్లు, ఆఫర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటాయి. దీనిని అవకాశంగా తీసుకుని, అచ్చంగా ఒరిజినల్ ఆఫర్స్‌ను తలపించేలా స్పామ్ ఇ-మెయిళ్లను, మెసేజ్‌లను సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు పంపిస్తుంటారు. వీటి ట్రాప్‌లో పడితే ఇక అంతే సంగతులు.
ఉదాహరణకు, వెంకట్రావుకు ఒక ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ నుంచి ప్రత్యేక డిస్కౌంటు ఇస్తున్నట్లుగా ఈ-మెయిల్ వచ్చింది. ఈ ఆఫర్ కేవలం 2 గంటల పాటే అందుబాటులో ఉంటుందని, అది కూడా పరిమితంగానే వస్తువులు అందుబాటులో ఉన్నాయని అందులో ఉంది. ఆలస్యం చేస్తే, ఈ మంచి అవకాశం చేజారి పోతుందని భావించాడు వెంకట్రావు. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తనకు వచ్చిన ఈ-మెయిల్లోని లింక్‌పై క్లిక్ చేశాడు. అందులో తన క్రెడిట్ కార్డు వివరాలన్నీ నమోదు చేశాడు. అంతే! ఆ కార్డులోని డబ్బులు మొత్తం పోయాయి. అప్పుడు అర్థమైంది తను మోసపోయానని. మరి ఇలాంటి పరిస్థితే మనకు కూడా వస్తే? అందుకే ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ మోసాలు జరిగినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం చేయాలి?
- పరిమిత కాలపు (లిమిటెడ్ టైమ్) ఆఫర్లు అంటూ వచ్చే ఈ-మెయిళ్లు, మేసేజ్‌లు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
- ఈ-మెయిల్లో వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
- దీనికి బదులుగా అధికారిక ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు.
- మోసపూరిత ఈ-మెయిళ్లలో కంపెనీల పేర్లకు సంబంధించి చాలా అక్షర దోషాలు ఉంటాయి. వీటిని కాస్త జాగ్రత్తగా గుర్తించాలి.
- పేమెంట్స్ విషయానికి వస్తే రెండంచెల భద్రతను (టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్) వినియోగించాలి. దీనివల్ల మీకు అదనపు రక్షణ ఉంటుంది.
- ఆన్లైన్ కొనుగోళ్లకు తక్కువ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులను వాడాలి.
- ఆఫర్లు, డిస్కౌంట్లు గురించి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకున్నాకే, కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.
- ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే మీ బ్యాంకుకు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయాలి.
COMMENTS