PM Yasasvi ScholarShip Programme
కోర్సు ముగిసే వరకు ఉపకారవేతనాలు - ఉన్నత విద్యకు అండగా 'పీఎం యశస్వి' - ఎవరు అర్హులంటే?
PM Yasasvi ScholarShip Programme : దేశంలో ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్‌ఐటీలు తదితర ప్రీమియర్ విద్యాసంస్థల్లో డీగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందిన ఓబీసీ, ఈబీసీ, సంచార జాతులకు చెందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనాలను ప్రకటించింది. విద్యార్థులకు వంద శాతం ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం యశస్వి' పథకం కింద ప్రత్యేక ఉపకారవేతనాలు అందిస్తోంది.
ఈ మేరకు 2024-25 సంవత్సరానికి 304 విద్యాసంస్థల్లో ఉపకారవేతనాల స్లాట్‌లను కేంద్ర సామాజిక న్యాయశాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్లాట్‌లలో 90 శాతం ఓబీసీలు, సంచారజాతుల వర్గాలకు చెందిన విద్యార్థులకు, 10 శాతం ఈడబ్ల్యూఎస్/ఈబీసీ వర్గాలకు కేటాయించింది. ఒకసారి ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల ప్రతిభ మేరకు, పునరుద్ధరణ దరఖాస్తు ఆధారంగా కోర్సు ముగిసేవరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది.
ఎవరు అర్హులు - ఆర్థిక సహాయం ఎంతంటే ? :
'పీఎం యశస్వి' పథకం కింద ఉపకార వేతనానికి దరఖాస్తు చేసే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల్లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరికి మించి లభించదు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన స్లాట్ సంఖ్యకన్నా ఓబీసీ, ఈబీసీ, సంచారజాతుల విద్యార్థులు ఎక్కువగా ఉంటే ప్రతిభ ఆధారంగా తొలిస్థానాల్లో నిలిచిన వారికి ఇస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే మిగతా స్లాట్‌లను సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సర్దుబాటు చేస్తారు. ఈ ఉపకారవేతనాల్లో 30 శాతం బాలికలకు ఇస్తారు.
విద్యార్థి ఫెయిల్ అయితే !! :
ఉపకారవేతనం పొందిన విద్యార్థి ఫెయిల్ అయినా మరుసటి సెమిస్టర్ ప్రమోట్ కాకున్నా ఆర్థిక సహాయం నిలిపివేస్తారు. ఈ ఉపకారవేతనం కోసం కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఒక్కో విద్యార్థికి ట్యూషన్ ఫీజు, నాన్‌రీఫండబుల్ ఫీజు కలిపి ఏడాదికి రూ.2 లక్షలు ఇస్తుంది. కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు కింద ఏడాది రూ.3.72 లక్షలు వస్తాయి. ప్రతినెల వసతి ఖర్చుల కింద రూ.3 వేలు, పుస్తకాలకు ఏడాదికి రూ.5 వేలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, యూపీఎస్ కోసం ఒకసారికే రూ.45 వేలు అందిస్తుంది.
COMMENTS