Selection of jobs in five companies at once with a huge package!
Andhra Pradesh: ఏపీ విద్యార్ధిని సత్తా.. భారీ ప్యాకేజీతో ఒకేసారి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక!
నేటి కాలంలో ఉద్యోగం సంపాదించాలంటే తలకు మించిన భారంగా భావిస్తున్నారు నిరుద్యోగులు. అలాంటిది ఓ యువతి ఒకేసారి ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి ప్రయత్నంలో వచ్చిన ప్యాకేజీకి నాలుగు రెట్లు అధికంగా వచ్చే ఉద్యోగం కైవసం చేసుకుంది. తనపై తల్లిదండ్రులు, అధ్యాపకులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈ పేదింటి చదువుల తల్లి.
బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన అనమలమూడి చిరంజీవి, భాగ్యలక్ష్మి దంపతులకు కుమార్తె శ్రావణి, కుమారుడు సంతానం. కుమార్తె శ్రావణి చిన్నతనం నుంచి చదువులో రాణించేంది. అద్దంకిలో పదో తరగతి, గుంటూరులో ఇంటర్ చదివింది. ఆ తర్వాత ఎంసెట్ రాసి, రాష్ట్రంలో 6వేల ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వీవీఐటీలో సీఎస్‌సీలో ప్రవేశం పొందింది. బీటెక్ కోర్సులో చివరి ఏడాదిలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెట్లకు శ్రావణి కూడా హాజరైంది. తొలి సారిగా ఎసెన్‌ట్యుర్ కంపెనీలో రూ.4.5 లక్షలు, ఓడో కంపెనీలో రూ.5 లక్షలు, ఐబీఎంలో రూ.9 లక్షలు, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11 లక్షలు, వాల్‌మార్ట్‌లో రూ.23 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు వరించాయి. ఇలా ఏకకాలంలో ఐదు కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ రావడంతో కళాశాల విద్యార్ధులతోపాటు, యాజమన్యం కూడా అబ్బురపడింది. లక్ష్యంతో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదని శ్రావణి చూపిన ప్రతిభ నిరూపించింది. తోటి విద్యార్థులకు సైతం ఆదర్శంగా నిలిచింది.
తాను చదివిన వీవీఐటీ కళాశాలలో ఒక విద్యార్థి ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధిస్తే.. వారి తల్లిదండ్రులను ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరిస్తున్నారని శ్రావణి తెలుసుకుంది. తన తల్లిదంద్రులకు కూడా ఇలాంటి సత్కారం చేయించాలని లక్ష్యం పెట్టుకుందట. అందులో భాగంగా తొలి ప్రయత్నంలో తక్కువ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా అంతటితో ఆగకుండా.. పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసింది. అన్నిట్లోనూ ఉద్యోగం వచ్చింది. దీంతో అధిక ప్యాకేజీ ఇస్తానన్న వాల్‌మార్ట్ కంపెనీలో చేరి, ఉద్యోగం కైవసం చేసుకుంది. లక్ష్యంతో ముందుకెళ్లే అనుకున్నది సాధించవచ్చని చెబుతుంది మన శ్రావణి.
COMMENTS