Is physical activity a risk to a child's future?-What does research say?
శారీరక శ్రమ లేకపోతే పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమా?- పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Heart Attack : చదువుల పేరుతో మీ పిల్లలను గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారా? లేదా మీ పిల్లలు టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి బయటి లోకాన్ని మరచిపోతున్నారా? అయితే, పెద్దయ్యాక జబ్బుల ముప్పు కొని తెచ్చుకుంటున్నట్టే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ పరిశోధకులు. పిల్లలు ఎక్కువసేపు కదలకుండా ఉంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో పిల్లలు గంటల కొద్దీ టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి బయటి లోకాన్ని మరిచిపోతున్నారు. శారీరక శ్రమతో కూడిన ఆటలపై ఆసక్తి చూపడం లేదు. ఫోన్, ల్యాప్‌టాప్‌ల్లో గేమ్స్ ఆడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, అలా శారీరక శ్రమకు అలవాటు పడని పిల్లలు పెద్దయ్యాక జబ్బుల ముప్పు కొని తెచ్చుకుంటున్నట్టే అంటున్నారు పరిశోధకులు. బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.
90ల్లో ఆరంభించిన అధ్యయనం ద్వారా పరిశోధకులు ఆసక్తికర అంశాలను గుర్తించారు. మొదట 11 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల కదలికలను ఏడు రోజుల పాటు లెక్కించారు. అనంతరం 15 ఏళ్లు, 24 ఏళ్ల వయసులోనూ తిరిగి లెక్కించారు. దాంతో పాటుగా ఎకోకార్డియోగ్రామ్‌తో 17, 24 ఏళ్ల వయసులో గుండె ఎడమ జఠరిక ఎత్తునూ పరిశీలించారు. పిల్లలు 11 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు రోజుకు సగటున 362 నిమిషాలు, 15 ఏళ్ల వయసున్న పిల్లలు 474 నిమిషాలు, 24 ఏళ్ల వయసున్న వారు 531 నిమిషాల సేపు కదలకుండా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే 11 నుంచి 24 ఏళ్ల మధ్యలో కదలకుండా కూర్చొనే సమయం సగటున రోజుకు 169 నిమిషాలు పెరిగిందన్నమాట. ఈ సమయం పెరుగుతున్నకొద్దీ ఎడమ జఠరిక ద్రవ్యరాశీ పెరుగుతున్నట్టు తేలిందనట్లు పరిశోధకులు తెలిపారు. ఇలా గుండె పెరిగినవారికి ఏడేళ్ల కాలంలో గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పులు రెండింతలు ఎక్కువవుతున్నట్టు గతంలో పెద్దవారి మీద చేసిన అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ విశ్వవిద్యాలయా పరిశోధనల ప్రకారం.... బాల్యంలో గంటల తరబడి కదలకుండా కూర్చోని ఉండటం వల్ల భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని Dr. Andrew Agbaje స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని The European Society of Cardiology (ESC) Congress 2023లో వెల్లడించారు. NIH బృందం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పిల్లలలో శారీరక శ్రమ:
పిల్లల రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందే విధంగా తయారు చేయవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా పిల్లలు పెరిగిన తరువాత వారి జీవితంలో గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అంటున్నారు. అందుకే తేలికపాటి శారీరక శ్రమను చేసేందుకు పిల్లల్ని ప్రోత్సహించాలంటున్నారు. ఫోన్లో గేమ్స్ కాకుండా, ఇంటి బయట ఆడటం, ప్లేగ్రౌండ్‌లో ఆటలు ఆడేవిధంగా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. పెంపుడు కుక్కను తిప్పడం, తల్లిదండ్రులతో కలిసి వాకిగ్కు వెళ్లడం, షాపింగ్ మాల్స్, స్కూల్‌కి నడవడం లాంటివి చేయాలంటున్నారు. సైక్లింగ్ చేయడం, సాయంత్రం పూట దగ్గర్లో ఉన్న పార్కుకు వెళ్లి ఆడుకోవడం, తోటపని, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫ్లోర్‌బాల్, వాలీబాల్ మొదలైన ఆటల ద్వారా శారీరక శ్రమ చేసినట్లవుతుందని పరిశోధకులు తెలిపారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS