Is the electricity bill coming in too much?-If you follow these tips, half the money will be left!
కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే!
How to Reduce Electricity Bill: ప్రసుతం అందరినీ వేధిస్తున్న సమస్య అధిక కరెంటు బిల్లు. ప్రతినెలా విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీంతో అంత భారీ మొత్తంలో కరెంటు బిల్లులు చెల్లించలేక సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం రండి.
ఎల్ఈడీ లైట్ల వాడకం: సాధారణ బల్బులు ఎక్కువ విద్యుత్తును కాలుస్తాయి. దీంతో కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో ఎల్ఈడీ లైట్లను వాడితే మంచిది. ఇవి తక్కువ కరెంట్‌ను కాలుస్తాయి. దీంతో వీటిని ఉపయోగిస్తే బిల్లు కూడా తక్కువగా వస్తుంది. దీంతోపాటు ఇవి ఎక్కువకాలం మన్నికను కూడా ఇస్తాయి.
అన్‌ప్లగ్ అప్లియన్సెస్: ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ను ఉపయోగించిన తర్వాత చాలామంది వాటిని అన్‌ప్లగ్ చేయకుండా అలానే ఉంచేస్తారు. స్విచ్ ఆఫ్ చేసినా అన్‌ప్లగ్ చేయకుంటే అవి కరెంట్‌ను లాగేస్తాయి. అందుకే ఇకపై సెల్‌ఫోన్ ఛార్జర్లు, టీవీలు, కంప్యూటర్లు, వైఫై రూటర్లు, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషీన్స్ వంటి ఎలక్ట్రానిక్ అప్లియన్స్ను వినియోగించిన తర్వాత వెంటనే అన్‌ప్లగ్ చేయటం మంచిది.
ఏసీ నిర్వహణ: హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మార్చాలి. సంవత్సరానికి ఒకసారైనా మెకానిక్ ద్వారా సర్వీస్ చేయించుకోవాలి. ఏసీ నిర్వహణ సక్రమంగా ఉంటే విద్యుత్‌ను తక్కువగా కాలుస్తుంది. దీంతోపాటు ఎక్కువకాలం మన్నిక కూడా ఇస్తుంది. దీంతోపాటు బాగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఏసీని వినియోగించటం ఉత్తమం.
పవర్ స్ట్రిప్స్ వాడకం: టీవీ, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పవర్ స్ట్రిప్లలోకి ప్లగ్ చేయాలి. దీంతోపాటు అలాంటి వస్తువులను స్టాండ్బైలో ఉంచకూడదు. కంప్యూటర్ను వినియోగించిన వెంటనే దాన్ని ఆఫ్ చేసేయండి. అలాకాకుండా స్టాండ్‌బై మోడ్‌లో ఉంటే అవి ఎక్కువ ఎలక్ట్రిసిటీని వినియోగిస్తాయి. దీంతో బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది.
ఇంటిని ఇన్సులేట్ చేయటం: ఇంటికి మంచి ఇన్సులేషన్ అవసరం. ఇది ఇంట్లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు సహాయపడుతుంది. తలుపులు, కిటికీల్లో ఖాళీలను మూసివేసి, గోడలు, ఇంటి పైకప్పులపై ఇన్సులేషన్ను ఇన్స్టాల్ చేసుకోండి. దీంతో హీటింగ్, కూలింగ్ ఖర్చులను తగ్గించుకోవచ్చు.
వాషింగ్ మెషీన్ల వాడకం తగ్గించటం: దుస్తులను ఉతికేందుకు వాషింగ్ మెషీన్‌ను వినియోగించటం తగ్గించాలి. చాలా బిజీ షెడ్యూల్లో సమయం లేనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కరెంట్ బిల్లుతో పాటు నీటిని కూడా ఆదా చేయొచ్చు.
క్లాత్స్ ఎయిర్ డ్రై: ఉతికిన దుస్తులను ఆరబెట్టేందుకు ఎప్పుడూ సహజ మార్గాలనే ఉపయోగించాలి. బట్టలను గాలి, సూర్యరశ్మిలో ఆరబెడితే మంచిది.
స్టార్ రేటింగ్స్ చూసుకోవటం: టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కొనేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్స్ ఉన్న వాటిని తీసుకుంటే మంచిది. దీనివల్ల విద్యుత్ వాడకం తగ్గటమే కాక బిల్లును కూడా తగ్గించుకోవచ్చు.
వీటితో పాటు పగటిపూట సూర్యరశ్మిని ఉపయోగించి లైట్స్, ఫ్యాన్స్ వినియోగం తగ్గిస్తే మంచిది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆఫ్ చేయండి. ఇలా విద్యుత్తును ఆదా చేసుకుని బిల్లును తగ్గించుకోవచ్చు.
COMMENTS