Free Electricity : Free electricity for educational institutions - Telangana Govt orders
Free Electricity : విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ - తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.
ఉపాధ్యాయ దినోత్సవం వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విద్యుత్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పై కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సమీక్ష:
తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టితో కలిసి సమీక్షించిన ఆయన… రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు అందజేస్తామని చెప్పారు. కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించారు.
వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్న ఆయన… ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
ఏఐ గ్లోబల్ సదస్సు - పాల్గొన్న సీఎం రేవంత్
హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ప్రతిష్టాత్మకమైన ఏఐ గ్లోబల్ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఏఐ రోడ్ మ్యాప్ ను, ఏఐ సిటీ నమూనాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో మార్పులు అసాధ్యమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. మార్పుకు సిద్దంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని చెప్పారు.
ప్రస్తుతం AI విప్లవం కొనసాగుతోందని, ఆ రంగంలో అపారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ రంగంలో రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామన్నారు. అందుకు ఏఐ నిపుణులతో కలిసి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తోన్న AI హబ్ లో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
COMMENTS