Do you know the meaning of TIN, VAT, PAN, DSC, DIN?
TIN, VAT, PAN, DSC, DIN వీటికి అర్థం తెలుసా?
Difference between TIN TAN VAT PAN DSC and DIN : కొత్తగా బిజినెస్ ప్రారంభించేవారు TIN, TAN, VAT, PAN, DSC, DIN వంటి మూడు అక్షరాల పదాలను ఎక్కువగా వింటుంటారు. అందుకే వ్యాపారులు ఈ పదాల గురించి, వీటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ స్టోరీలో ఈ పదాల ఫుల్ ఫామ్స్, వాటిని ఎవరికిస్తారు వంటి వివరాలు తెలుసుకుందాం.
Tax Payer Identification Number (TIN లేదా VAT) :
TIN(టిన్) అంటే పన్ను చెల్లింపుదారుడి గుర్తింపు సంఖ్య. దీనినే VAT, CST, సేల్స్ ట్యాక్స్ నంబరు అని కూడా పిలుస్తుంటారు. టిన్ అనేది రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పన్ను చెల్లింపుదారుడికి ఇచ్చే ప్రత్యేక సంఖ్య. ఇందులో 11 అంకెల సంఖ్య ఉంటుంది. వ్యాట్ సంబంధిత లావాదేవీలన్నింటిలో ఈ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యాట్ కింద నమోదైన డీలర్లను గుర్తించడానికి టిన్ ఉపయోగపడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర విక్రయాలకు కూడా టిన్ అవసరం. తయారీదారులు, ఎగుమతిదారులు, దుకాణదారులు, డీలర్లు, వస్తువులను విక్రయించే ఈ-కామర్స్ సంస్థలకు ఈ టిన్ అవసరం.
Goods and Services Tax (GST లేదా GSTIN):
పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2017 జులై 1న జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఉన్న వ్యాట్ లేదా టిన్‌కు బదులుగా కేంద్రం దీన్ని ప్రవేశపెట్టింది. వ్యాట్ లేదా టిన్ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని సంస్థలు తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలోకి రావాల్సిందే. ఏడాదికి రూ. 20 లక్షల కంటే ఎక్కువ వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలు జీఎస్టీలో నమోదు చేసుకోవాలి.
Tax Deduction and Collection Account Number (TAN):
TAN అంటే పన్ను మినహాయింపు, సేకరణ ఖాతా సంఖ్య. ఐటీ శాఖ జారీ చేసే టాన్‌లో 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. టాన్ కార్డును మూలం వద్ద పన్ను మినహాయింపుదారుల కోసం జారీ చేస్తారు. మూలం వద్ద పన్ను మినహాయించే వ్యాపారాలకు టాన్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ చాలా అవసరం. నంబర్‌ను తప్పనిసరిగా టీడీఎస్ లేదా టీసీఎస్ లో ఫైల్ చేయాలి. టాన్ కార్డు పొందిన తర్వాత వ్యాపారులు తప్పనిసరిగా త్రైమాసిక టీసీఎస్ రిటర్న్ లను ఫైల్ చేయాలి.
Permanent Account Number (PAN):
పాన్ కార్డు అంటే శాశ్వత ఖాతా సంఖ్య. ట్యాక్స్ పేయర్స్, వ్యాపారులు, వ్యక్తులు, ట్రస్టులు, విదేశీ పౌరులకు ఐటీ శాఖ 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ గుర్తింపు సంఖ్యను అందిస్తుంది. పాన్ కార్డు అనేది గుర్తుంపు కార్డుగా పనిచేస్తుంది. కంపెనీ లేదా వ్యాపారం ప్రారంభించేవారికి ఇది తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తిస్తుంది. ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం, రుణం పొందడం, ఆస్తులు కొనుగోలు సమయాల్లో పాన్ కార్డు అవసరం అవుతుంది.
Digital Signature Certificate (DSC):
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) అనేది ఎలక్ట్రానిక్ అధీకృత ఫార్మాట్. ఇది నిర్దిష్ట ఆన్‌లైన్ లావాదేవీలు, ఐటీఐర్ ఫైలింగ్‌కు ఫ్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను ప్రధానంగా ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఈపీఎఫ్‌లలో వాడతారు.
Director Identification Number (DIN):
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది కంపెనీ డైరెక్టర్‌కు జారీ చేసే ప్రత్యేక నంబర్. కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ఇది అవసరం. భారతదేశంలో ఎల్ఎల్పీని నమోదు చేసుకోవడానికి డీపీఐఎన్ అవసరం. డీఐఎన్‌లో కంపెనీ డైరెక్టర్ వ్యక్తిగత సమాచారం ఉంటుంది. దీన్ని వ్యక్తులు మాత్రమే పొందవచ్చు. ఐటెండిటీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్‌ను సమర్పించి దీన్ని పొందొచ్చు. DIN పొందాలంటే మీ దగ్గర తప్పనిసరిగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) ఉండాలి.
COMMENTS