Suffering from sputum accumulation? - Taking it a little daily can get a blow!
కఫం పేరుకుపోయి ఇబ్బందిపడుతున్నారా? - దీన్ని రోజూ కొద్దిగా తీసుకుంటే దెబ్బకు బయటకొచ్చేస్తుంది!
Best Ayurvedic Remedy to Reduce Phlegm: వర్షాకాలంలో చాలా మంది సీజనల్ వ్యాధులతో పాటు గొంతునొప్పి, కఫం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా శరీరంలో కఫం చేరడం వల్ల శ్వాస తీసుకోవడంలో, ఆహారం మింగడంలో ఇబ్బంది, తరచూ దగ్గు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, అలాంటి టైమ్‌లో ఉలవలతో ప్రిపేర్ చేసుకునే ఈ పథ్యాహారాన్ని తీసుకుంటే కఫం ఇట్టే తగ్గిపోతుందంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. ఇందుకోసం ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్‌గా నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఇది టేస్టీగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందంటున్నారు. ఇంతకీ, దీనికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉలవ పిండి - 2 చెంచాలు
- పిప్పళ్లు - 1 చిన్న చెంచాడు
- పటికబెల్లం - 1 చెంచా
- నూనె - 1 చెంచా
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా ఉలవ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా.. పిప్పళ్లను ఒక చెంచడు నూనెలో కాసేపు వేయించుకొని పొడిలా తయారుచేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే.. పటికబెల్లాన్ని పొడిలా ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
అయితే, ఇక్కడ ఉలవలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటాం. అదే.. పిప్పళ్లను మాత్రం తక్కువ పరిమాణంలో తీసుకుంటామనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. ఉలవలు(Horse Gram) అనేవి ఆహారంగా తీసుకునే పదార్థం. కానీ.. పిప్పళ్లు అనేవి కేవలం ఔషధంలా కొంచం తీసుకుంటాం.
ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని సుమారు 2 కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు.. అందులో ఉలవ పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కాసేపు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
ఉలవ పిండి మిశ్రమం బాగా ఉడికిందనుకున్నాక.. దానిలో పిప్పళ్ల పొడి, పటిక బెల్లం పొడి వేసుకొని అన్ని కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మంటపై కాసేపు ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్‌ను దించుకోవాలి.
అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే.. కఫాన్ని తగ్గించే "ఉలవ జావ" ఆయుర్వేద హోమ్ రెమిడీ రెడీ!
దీన్ని ఎలా తీసుకోవాలంటే?:
కఫంతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నవారు ఈ ఆయుర్వేద పథ్యాహారాన్ని రోజూ ఆహారంలో ఒక ఐటమ్‌లాగా తీసుకుంటే సరిపోతుందంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవి. కఫ సమస్య తగ్గిపోయిన తర్వాత దీన్ని తీసుకోవడం మానేయొచ్చు. లేదంటే.. తగ్గాక తీసుకున్నా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు! దీన్ని తీసుకోవడం ద్వారా కఫ సమస్య తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS