Are you giving your bank account to cybercriminals hoping for commission - then go to jail!
కమీషన్‌కు ఆశపడి సైబర్ నేరగాళ్లకు మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారా? - అలా చేస్తే జైలుకే!
Man Held For Renting Out Bank Accounts To Cybercrooks : సైబర్ నేరాలపట్ల ప్రజలకు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఏదో ఓ చోట సైబర్‌క్రైమ్‌లు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ కేటుగాళ్లు పాల్పడే నేరాల్లో సామాన్యులను కూడా భాగం చేస్తున్నారు. వారికి కమీషన్ల ఆశచూపించి కాజేసిన డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.కోటి నలబై మూడు లక్షల డబ్బైఅయిదు వేలు కాజేసిన నేరగాళ్లు వాటిని కమీషన్‌కు కక్కూర్తి పడి అకౌంట్ ఇచ్చిన వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అద్దెకు అకౌంట్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది :
సైబర్ నేరాల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ మోసాలతో కాజేసే సొమ్ము కమీషన్ కోసం ఓ వ్యక్తి తన ఖాతానే అద్దెకు ఇవ్వడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. రామగుండం సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం జులై 22న మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌కు ముంబయి పోలీసుల పేరుతో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని, బయటపడాలంటే తాను చెప్పిన ఖాతాలోకి డబ్బు పంపించాలని బెదిరించాడు.
సైబర్ కేటుగాళ్లకు అకౌంట్ ఇచ్చిన వ్యక్తి అరెస్టు :
తనకు పంపిన డబ్బును పరిశీలించి తిరిగి మళ్లీ మీ(బాధితుడు) ఖాతాలోనే జమ చేస్తానని సైబర్ కేటుగాడు నమ్మించాడు. దీంతో బాధితుడు విడతల వారీగా రూ.కోటి 43లక్షల 75,000లను నిందితుడు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. మొత్తం డబ్బు జమ చేసిన తర్వాత తిరిగి తన ఖాతాలోకి క్రెడిట్ అవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు తెలుసుకొని జులై 29న 1930 నెంబరుకు ఫిర్యాదు చేశాడు.
విచారణ చేపట్టిన రామగుండం సైబర్ క్రైం పోలీసులు బాధితుడు డబ్బులు పంపిన ఖాతా మహారాష్ట్రలోని వాసిం జిల్లా దేవుపేటకు చెందిన సంతోష్ శ్రీకృష్ణ నాగల్కర్దిగా గుర్తించారు. మహారాష్ట్రలో అరెస్టు చేసి ఖాతా నెంబరు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. సదరు నిందితుడు కమీషన్ కోసం తన ఖాతాను సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 18 సైబర్ నేరాలకు వినియోగించినట్లు తేలగా డబ్బు కాజేసిన అసలైన నిందితుడు మాత్రం చిక్కలేదని దీనిపై దర్యాప్తు చేపట్టామని ఏసీపీ వివరించారు.
COMMENTS