Along with Srisailam Mallanna Darshan, Rope Way, Boat Journey! - Telangana Tourism Super Packages!
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్ వే, బోట్ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీలు!
Telangana Tourism Srisailam Tour Packages: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు అందుబాటు ధరల్లోనే పలు ప్యాకేజీలను తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
శ్రీశైలంలోని పలు ప్రదేశాలను చూసేందుకు తెలంగాణ టూరిజం డైలీ శ్రీశైలం టూర్(Daily Srisailam Tour) పేరుతో ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 1 రాత్రి, 2 పగళ్లు కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. శ్రీశైల దర్శనంతోపాటు పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం డ్యామ్, శిఖరం సహా పలు ప్రదేశాలు చూడొచ్చు.
ప్రయాణ వివరాలివే:
మొదటి రోజు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి బషీర్‌బాగ్ చేరుకుని ఉదయం 9 గంటలకు శ్రీశైలానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. మార్గం మధ్యలో లంచ్ ఉంటుంది. భోజనం తర్వాత సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. నేరుగా హోటల్‌కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించరు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.)
రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం.. తదితర ప్రాంతాలను చూస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ధరలు చూస్తే :
ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2,400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది.
నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.
హైదరాబాద్ – శ్రీశైలం- సోమశిల టూర్ ప్యాకేజీ:
శ్రీశైలానికి మరో ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ – శ్రీశైలం- సోమశిల (Hyderabad – Srisailam – Somasila) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో సోమశిల, శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి దర్శనం.. తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 1 రాత్రి, 2 రోజులు కొనసాగుతుంది.
సోమశిల ప్రయాణం సాగుతుంది ఇలా..
మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 9:00 గంటలకు బషీర్‌బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. మార్గమధ్యలో లంచ్ ఉంటుంది. భోజనం తర్వాత సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (పర్యాటకులు సాయంత్రం లేదా తెల్లవారుజామున దర్శనం చేయవలసి ఉంటుంది.)
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బోట్ జర్నీ ద్వారా సోమశిలకు ప్రయాణం ఉంటుంది. అక్కడ పలు ప్రదేశాలను చూడవచ్చు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకి సోమశిల నుంచి బస్సు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ధరలు చూస్తే:
హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 4,999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3,600గా ఉంది.
COMMENTS