This is the reign of AAP fire brand Atishi Marlina from teacher to Delhi CM!
టీచర్ నుంచి దిల్లీ సీఎంగా- ఆప్ ఫైర్‌బ్రాండ్ ఆతిశీ మార్లీనా ప్రస్థానం ఇదే!
Who is Atishi Marlena : ఆతిశీ మార్లీనా సింగ్, ఈ మధ్య కాలంలో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతకుముందు, టీచర్, సామాజిక కార్యకర్త, ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా మారారు. ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వంలో విద్యా, పీడబ్ల్యూడీ, కల్చర్, ఫైనాన్స్, టూరిజం శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఆప్ పోలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగానూ ఉన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోదియా అరెస్ట్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆతిశీ బాధ్యతలు తీసుకున్నారు. సిసోదియా మంత్రిగా ఉన్న సమయంలో, 2015 జులై నుంచి 2018 ఏప్రిల్ వరకు విద్యాశాఖకు అడ్వైజర్‌గా పనిచేశారు. సామాజిక కార్యకర్త నుంచి దిల్లీ ముఖ్యమంత్రి వరకు ఆతిశీ ప్రస్థానం ఇది.
బాల్యం, విద్యాభ్యాసం
ఆతిశీ మార్లీనా సింగ్, 1981 జూన్ 8న జన్మించారు. ఆతిశీ తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు. మార్క్స్, లెనిన్ కలయికతో(Marx+Lenin- Marlena) ఆమెకు ఆతిశీ మార్లీనా అని పేరు పెట్టారు. ఆతిశీ దిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సేయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి 2021లో డిగ్రీ పట్టా అందుకున్నారు. చీవ్‌నింగ్ స్కాలర్‌షిప్‌తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2003లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డాలెన్ కాలేజీలో రోడ్స్ స్కాలర్‌గా(Rhodes scholar) ఉన్నారు. ఆతిశీ కొంతకాలం ఆంధ్రప్రదేశ్‌లోని రిశి వ్యాలీ స్కూల్లో చరిత్ర, ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు.
రాజకీయాల్లోకి అరంగేట్రం:
- ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం నుంచి ఆతిశీ పనిచేశారు. 2013లో పార్టీ ప్రాథమిక పాలసీలు రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆప్ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.
- దిల్లీలోని కల్కాజీ ప్రాంతానికి ఆప్ ప్రతినిధిగా, ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఈస్ట్ దిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు.
- ఆప్ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం, 2015 జులై నుంచి 2018 ఏప్రిల్ వరకు విద్యాశాఖకు అడ్వైజర్‌గా పనిచేశారు. దిల్లీలో ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరడానికి తీవ్రంగా కృషిచేశారు.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆతిశీ, ఈస్ట్ దిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో పరాజయం పాలయ్యారు.
- 2020లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిపై 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలా పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించిన ఆతిశీ, గోవాలో ఆప్ ఛీప్‌గా వ్యవహరించారు.
దిల్లీలోని విద్యాసంస్థలు ఆతిశీ సారథ్యంలో గణనీయంగా మెరుగుపడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, దీల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా నిబంధనలను పటిష్టం చేయడం, స్కూల్ కరికులంలో "హ్యాపీనెస్" పాఠ్యాంశాలను రూపొందించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు.
మంత్రిగా:
మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మార్చి 9న మంత్రి అయ్యారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఆర్థిక, ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్స్, పవర్, రెవెన్యూ, లా, ప్లానింగ్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, విజిలెన్స్ శాఖలను నడిపించారు.
COMMENTS