PM Mudra Yojana: Small businessmen, loans up to Rs.20 lakh
చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా.
PM Mudra Yojana Loans : చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు మైక్రో క్రెడిట్/లోన్‌ను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు తయారీ, వ్యాపారం లేదా సేవా రంగాలలోని సూక్ష్మ సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మొదట్లో ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వ్యక్తులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు లోన్ పొందేవారు. 2024-25 బడ్జెట్లో ఈ లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ముద్ర యోజన పథకం కింద రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తున్నారు.
సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు, చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగ యూనిట్లు, దుకాణాలు, పండ్లు / కూరగాయాల షాపులు, ట్రక్ ఆపరేటర్లు, ఆహార-సేవ యూనిట్లు, మరమ్మతు దుకాణాలు, మెషిన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులవారు, ఆహార సంస్థలు ఈ పథకం కింద లోన్లు పొందవచ్చు. అర్హులకు ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. శిశు రుణాలకు 1%-12% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్ఆర్బీ, ఎస్సీబీలు 3.5 శాతం, ఎన్బీఎఫ్సీలు 6 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. కిషోర్ రుణాల వడ్డీ శాతం 8.6 నుంచి ప్రారంభం అవుతుంది. తరుణ్ రుణాలకు 11.15%-20% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.
శిశు, కిషోర్, తరుణ్ లోన్లు:
ఈ పథకంలో మూడు రకాల లోన్లు అందజేస్తున్నారు. అవి శిశు, కిషోర్, తరుణ్ లోన్లు. శిశు విభాగంలో దరఖాస్తుదారులు రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిషోర్ విభాగంలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ విభాగంలో రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు విధానం:
Step 01 : PMMY(https://mudra.org.in/ ) లోన్ దరఖాస్తు కోసం ముందుగా ఉద్యమమిత్ర పోర్టల్ https://www.udyamimitra.in/ పై క్లిక్ చేయండి.
Step 02 : ముద్ర లోన్ అప్లై క్లిక్ చేయండి.
Step 03 : న్యూ రిజిస్ట్రేషన్ దరఖాస్తుదారుడి పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
Step 0 4 : మీ వ్యక్తిగత వివరాలు, వృత్తి, వ్యాపారపరమైన వివరాలను నమోదు చేయండి.
Step 05 : ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీలను ఎంచుకోండి లేదా "లోన్ అప్లికేషన్ సెంటర్"ని క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
Step 06 : మీకు ఏ విభగంలో రుణం కావాలో ఎంచుకోండి - ముద్ర శిశు / ముద్ర కిషోర్ / ముద్ర తరుణ్.
Step 07 : దరఖాస్తుదారుడి వ్యాపారం పేరు, కార్యకలాపాలు ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. తయారీ, సేవ, వ్యాపారం లేదా వ్యవసాయ అనుబంధంగా ఉన్న కార్యకలాపాలను ఎంచుకోవాలి.
Step 08: దరఖాస్తుదారుడి వివరాలు, బ్యాంకింగ్/క్రెడిట్ వివరాలు ఇతర సమాచారాన్ని అందించాలి.
Step 09 : అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. అంటే గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారుడి ఫొటో, సంతకం, బిజినెస్ ఎంటర్ప్రైజ్ చిరునామా మొదలైనవి.
Step 10 : అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. దీనిని భవిష్యత్తు సూచన కోసం భద్రపరుచుకోవాలి.
శిశు లోన్ కోసం అవసరమయ్యే పత్రాలు:
- గుర్తింపు కార్డులు - ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డ్ / ఆధార్ కార్డ్ / పాస్‌పోర్ట్ / ఫొటో ఐడీ కాపీలు.
- నివాస రుజువు : ఇటీవలి టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు / ఆస్తి పన్ను రసీదు (2 నెలల కంటే పాతది కాకుండా) / ఓటరు ఐడీ/ ఆధార్ కార్డు /పాస్‌పోర్టు/ బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ తాజా ఖాతా స్టేట్మెంట్.
- ఇటీవల దిగిన రంగు పాస్ పోర్టు సైజు ఫొటోలు (2 కాపీలు).
- కొనుగోలు చేయవలసిన యంత్రాలు / ఇతర వస్తువుల కొటేషన్.
- వ్యాపార సంస్థ గుర్తింపు కార్డు/ చిరునామా – సంబంధిత లైసెన్స్‌లు / రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు / యాజమాన్యానికి సంబంధించిన ఇతర పత్రాలు, వ్యాపార యూనిట్ అడ్రస్.
కిషోర్, తరుణ్ లోన్ కోసం అవసరమయ్యే పత్రాలు:
- గుర్తింపు కార్డులు - ఓటరు ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్‌పోర్ట్.
- నివాస రుజువు - ఇటీవలి టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను రసీదు (2 నెలల కంటే పాతది కాకుండా), ఓటరు ఐటీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు.
- 2 పాస్ పోర్టు సైజు ఫొటోలు.
- వ్యాపార సంస్థ గుర్తింపు/చిరునామా రుజువులు, సంబంధిత లైసెన్స్‌లు/రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు/ఇతర పత్రాలు.
- దరఖాస్తుదారుడు ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థలో డిఫాల్టర్‌గా ఉండకూడదు.
- గత ఆరు నెలల అకౌంట్ స్టేట్మెంట్.
- ఆదాయపు పన్ను/సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్, గత రెండు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు (రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాలు).
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వివరాలు.
- ప్రాజెక్ట్ నివేదిక, సాంకేతిక, ఆర్థిక వివరాలు.
COMMENTS