Remove 'late payments' from your credit report? Do this
మీ క్రెడిట్ రిపోర్ట్ నుంచి 'లేట్ పేమెంట్స్'ను తొలగించాలా ? ఇలా చేయండి!
Remove Late Payments In Credit Report : మంచి క్రెడిట్ స్కోరును ఎవరు మాత్రం కోరుకోరు! క్రెడిట్ హిస్టరీ బాగుంటేనే క్రెడిట్ స్కోరు మన సొంతం అవుతుంది. మనం తీసుకున్న లోన్స్, మనం వాడుకున్న క్రెడిట్ కార్డు ఫండ్స్‌ను సకాలంలో తిరిగి చెల్లిస్తేనే మంచి స్కోరు నమోదు అవుతుంది. సకాలంలో పేమెంట్స్ చేయకుంటే కచ్చితంగా దాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలు నెగెటివ్‌గా పరిగణిస్తాయి. అయితే ఒక్కోసారి క్రెడిట్ బ్యూరోలు మనం రీపేమెంట్ సకాలంలో చేసినా చేయనట్టుగా చూపించే అవకాశాలు లేకపోలేదు. పొరపాటున, సాంకేతిక కారణాలతో ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సాధ్యమైనంత తొందరంగా అలర్ట్ కావాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ లోపాల్ని గుర్తించాక దిద్దుబాటు కోసం మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మూడు ప్రధాన క్రెడిట్ బ్యూరోలు:
క్రెడిట్ బ్యూరోలు మన క్రెడిట్ హిస్టరీని మదింపు చేస్తాయి. మన లావాదేవీలు, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన నివేదికలను ఇవి రూపొందిస్తాయి. మన దేశంలో ప్రధానంగా మూడు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. అవి సిబిల్ (CIBIL), ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్. వీటిలో సిబిల్ చాలా ఫేమస్. ఇది అందరికీ సుపరిచితం. చాలా బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి, క్రెడిట్ కార్డులు మంజూరు చేయడానికి సిబిల్ స్కోరును ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఇంకొన్ని ఆర్థిక సంస్థలు ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటాయి.
క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు ఇలా:
మనం లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలోనే చెల్లించినా, ఏదైనా క్రెడిట్ బ్యూరో రిపోర్టులో 'లేట్ పేమెంట్' కేటగిరీలో దాన్ని చూపిస్తే వెంటనే మనం అప్రమత్తం కావాలి. ఆ విధంగా తప్పుడు రిపోర్టును ప్రచురించిన క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం మనం కొన్ని డాక్యుమెంట్స్‌ను రెడీ చేసుకోవాలి. ఆ పేమెంటును మనం సకాలంలో చెల్లించామనే రుజువుగా బ్యాంకు స్టేట్‌మెంట్, లోన్ స్టేట్మెంట్ లేదా క్రెడిట్ కార్డు బిల్ స్టేట్మెంట్ వంటివి సిద్ధం చేసుకోవాలి. ఏ రోజున, ఏ సమయంలో మనం తిరిగి చెల్లించాం? బ్యాంకు నుంచి డబ్బులు ఎప్పుడు కట్ అయ్యాయి? ఫోనుకు వచ్చిన మెసేజ్‌ల వివరాలు, బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లు స్టేట్మెంట్ పీడీఎఫ్ డాక్యుమెంట్లు వంటివన్నీ కలిపి సంబంధిత క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదును పంపాలి. మనం పంపిన ఫిర్యాదును సదరు క్రెడిట్ బ్యూరో పరిశీలిస్తుంది. మనం చెబుతున్న తేదీల్లో వాస్తవికంగా రీపేమెంట్ జరిగిందా, లేదా అనేది బ్యాంకు ద్వారా నిర్ధరణ చేసుకుంటుంది. వారి వైపు నుంచి క్రెడిట్ రిపోర్టులో పొరపాటు జరిగిందని గుర్తిస్తే తప్పకుండా క్రెడిట్ రిపోర్టులో మార్పులు చేస్తుంది. మీరు సూచించిన భాగంలో సవరణలు చేస్తుంది. దీనిపై ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందిస్తుంది.
ఇకపై క్రమశిక్షణగా ఉంటే:
ఒకవేళ మీరు ఇప్పటివరకు నిజంగానే లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో పేమెంట్ చేయకున్నా గాబరా పడాల్సిన పనిలేదు. కనీసం ఇకపై క్రమశిక్షణగా వ్యవహరించాలి. సకాలంలో బిల్స్ కట్టే అలవాటు చేసుకోవాలి. దానివల్ల కొంత కాలం తర్వాత మీ క్రెడిట్ స్కోరు మళ్లీ పెరగడం ప్రారంభం అవుతుంది.
COMMENTS