'It is true that aliens exist - we and they must fight!' - ISRO Chairman
'ఏలియన్స్ ఉన్నమాట నిజమే - మనకు, వాళ్లకు యుద్ధం తప్పదు!' - ఇస్రో ఛైర్మన్.
ISRO Chairman On Aliens : ఏలియన్స్ ఉనికి గురించి ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రణవీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ గ్రహాంతరవాసుల ఉనికిపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
వందేళ్లలో పెరిగిన టెక్నాలజీ:
వందేళ్ల క్రితంతో పోలిస్తే భూమిపై టెక్నాలజీ విపరీతంగా పెరిగిందని సోమనాథ్ వ్యాఖ్యానించారు. ఈ వేగవంతమైన పరిణామం ఏలియన్స్ ఉనికి గురించి ఆలోచించడానికి పనికొస్తుందని అన్నారు. "గత వందేళ్లుగా భూమిపై ఉన్న మానవులతో పాటు, విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి. మానవుడి కంటే కొన్ని జీవరాశులు టెక్నాలజీలో ముందు ఉండొచ్చు. మరికొన్ని వెనుకుంటాయి. భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్డ్గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చు. రానున్న 1000 ఏళ్లలో విశ్వవ్యాప్తంగా టెక్నాలజీ పెరగొచ్చు. భూమిపై కాకుండా వేరే చోట 1000 ఏళ్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇప్పటికే ఉండొచ్చు" అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
ఏలియన్స్ భూమిపైకి వస్తే?
ఏలియన్స్ భూమిపైకి వస్తే జరిగే నష్టాలను కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. భూమిపై ఉన్న జీవులతో పోలిస్తే ఏలియన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా వారి శరీరం జినోమిక్, ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మానవులు, ఏలియన్స్ మధ్య సంఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఆధిపత్య పోరు కూడా జరగొచ్చని అంచనా వేశారు.
ఏలియన్స్‌పై అనేక ఊహాగానాలు:
ఇదిలా ఉండగా, ఇప్పటికే ఏలియన్స్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు చెబుతుంటే, మరికొందరు అలాంటి అవకాశం ఉండదని కొట్టిపారేస్తున్నారు. 'ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతోంది. ఇప్పటికే అమెరికా వద్ద గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఉంది' అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఏలియన్స్ ఉనికిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
COMMENTS