Need to settle down financially in life? Start investing with Rs.10 thousand per month!
జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? నెలకు రూ.10వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా!
How To Make An Investment Plan : జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలంటే పొదుపు, మదుపు తప్పనిసరి. ఎంత తొందరగా వీటిని ప్రారంభిస్తే, అంత త్వరగా మీ ఆర్థిక లక్ష్యాలు సాధించగలుగుతారు. అయితే చాలా మందికి నెలవారీ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు భవిష్యత్ కోసం ఎలా పొదుపు చేయాలి? ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడులు పెట్టాల్సిందే!
మీ ఆర్థిక ప్రణాళికలో కచ్చితంగా పెట్టుబడులు ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది.
నెలకు రూ.10 వేలతో
మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. నెలకు కనీసం రూ.10 వేలతో పెట్టుబడులను ప్రారంభించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లను కనీసం మూడింటిని ఎంచుకోండి. ఒక దానిలో కనీసం రూ.2వేలు పెట్టుబడి పెట్టండి. మరో ఫండ్‌లో రూ.1,000, ఇంకో ఫండ్‌లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయండి.
- ఓ రూ.2,000లను జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో జమ చేయండి. దీని వల్ల పదవీ విరమణ తరువాత మీకు మంచి కార్పస్ (నిధి) ఏర్పడుతుంది.
- అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయండి. దీనిలో కనీసం నెలకు రూ.2,000 చొప్పున పొదుపు చేయండి.
- అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు బీమా పాలసీలు తీసుకోవాలి. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు రూ.1,000 కేటాయించండి.
- మిగిలిన రూ.1,000తో మంచి పనితీరు చూపిస్తున్న షేర్లను కొనడం మంచిది. అయితే దీనిలో కొంత రిస్క్ కచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగించాలి. అనుకోకుండా వెనక్కి తీసుకున్నా, వీలైనంత తొందరగా దాన్ని భర్తీ చేయాలి. ఏటా కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే, మంచి సంపదను సృష్టించుకోవచ్చు.
నోట్ : ఈ ఆర్టికల్లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది. కనుక కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
COMMENTS