Combing hair repeatedly? Beware of hair loss! Ayurvedic tips for hair loss.
జుట్టును పదేపదే దువ్వుతున్నారా? వెంట్రుకలు రాలిపోతాయట జాగ్రత్త! హెయిర్ లాస్‌కు ఆయుర్వేద చిట్కాలు.
Hair Loss Treatment in Ayurveda : మనకు వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే అందంలో ఏదో చేజారిపోతున్నంతగా ఆందోళన పడతారు. ప్రతిరోజు మనం తల దువ్వుకునేటప్పుడు.. తల స్నానం చేసేటప్పుడు, నూనె రాసుకునేటప్పుడు సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. అయితే, ఇది సహజమైన అంశమే.. అంతకుమించి వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఇందుకోసమే జుట్టును ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయపడుతూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈ సమస్యకు మనం తీసుకునే ఆహారం నుంచి శరీరంలోని పిత్త దోషాలు, తీవ్రమైన వేడి, ఒత్తిడి, ఆందోళనలు, కాలుష్యం.. ఇలా చాలా కారణాలే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని చక్కగా అరికట్టవచ్చని ప్రముఖ ఆయుర్వేద ఫిజీషియన్ డాక్టర్ పెద్ది రమాదేవి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు:
- చేపలు, గుడ్లు
- కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారం
- ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్ ఉండే పదార్థాలు
- బ్రొకలీ లాంటి తాజా పండ్లు
- విటమిన్ సీ ఎక్కువ ఉండే ఆహారం
- చిలగడ దుంపలు
- త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు అరచెంచా తీసుకోవాలి.
- బృంగరాజ్, అశ్వగంధ చూర్ణాన్ని అరచెంచా తీసుకోవాలి.
కొంతమందికి సీజనల్‌గా జుట్టు ఊడిపోతుందని.. ఆ సమయంలో ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ రమాదేవి చెబుతున్నారు. ఇంకా కొంతమంది డైటింగ్ చేస్తూ పూర్తిగా అన్నాన్ని మానేస్తారని అలా చేయకూడదని వివరించారు. దీంతోపాటు అతిగా వ్యాయామం చేసే వారిలో కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ జాగ్రత్తలతో పాటు ఈ సమస్యను అరికట్టడానికి ఆయుర్వేద కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చూపుతుందన్నారు. కొన్ని పదార్థాల మిశ్రమంతో చేసిన ఔషధాన్ని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం
కావాల్సిన పదార్థాలు:
- కోడి గుడ్డు
- పెరుగు
- అరటిపండు
- ఆలివ్ నూనె
- నిమ్మరసం
- విటమిన్ ఈ క్యాప్సుల్
తయారీ విధానం, వాడకం:
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఆలివ్ నూనెను కలపాలి.
దీనిలోనే విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా ఒకటి వేసి బాగా కలియతిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి.
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు బాగా పట్టించాలి.
సుమారు 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే అసలే రాలవట!
పీసీఓడీ, థైరాయిడ్ ఉన్నవారిలో కూడా జుట్టు త్వరగా ఊడిపోతుందని డాక్టర్ రమాదేవి పేర్కొన్నారు. మొదటి దశలోనే దీనిని గుర్తించడం వల్ల త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి తల స్నానం నుంచి జుట్టును దువ్వుకునే వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
- జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి.
- వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
- పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.
- ఆహారంలో జింక్, బయోటిన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి
- తలను పదేపదే దువ్వడం, తరచూ హెయిర్ డ్రైయర్‌ను వాడకూడదు
- ఒత్తిడి, ఆందోళనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి
- చుండ్రు, పేను కొరుకుడు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సహాయం తీసుకోవాలి.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS