Good News : Good news for caste professions.. Rs. 3 lakhs with zero interest..
Good News : కుల వృత్తుల వారికి గుడ్ న్యూస్.. సున్నా వడ్డీకే రూ.3 లక్షలు..!
Good News : చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలు చేసిన ఆదరణ పథకాన్ని పలు మార్పులతో మళ్లీ అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను ఆదరణ పథకంతో అనుసంధానించి అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు సున్నావడ్డీకే రూ.3 లక్షలు రుణం అందించనున్నది.
ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి రెండు విడతల్లో రూ.3 లక్షల రుణం అందిస్తారు. 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో 8 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుండగా మిగిలిన 5 శాతాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పీఎం విశ్వకర్మ యోజనకు ఆదరణ పథకాన్ని లింక్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం కింద ఎంపిక చేసిన వారికి వడ్డీ లేకుండా రూ.3 లక్షలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం, 5 శాతం లబ్ధిదారులు చెల్లిస్తుండగా.. లబ్ధిదారులు చెల్లించే ఐదు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు లక్షల రుణంలోనూ కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రకంగా మొత్తం రూ.3 లక్షల రుణాన్ని సున్నా వడ్డీకే అందించేలా పథకానికి రూపకల్పన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 16 లక్షల చేతి వృత్తుల కుటుంబాలు ఉన్నాయి. అయితే వారిలో ఎంతమంది ప్రస్తుతం చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై సర్వే చేయనున్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఆదరణ- విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది.
COMMENTS