Do you have kidney stones?- These tips will dissolve them!
కిడ్నీలో రాళ్లున్నాయా?- ఈ చిన్న టిప్స్‌తో ఇట్టే కరిగిపోతాయ్!
Kidney Stone Treatment : ప్రస్తుత ఆధునిక జీవనశైలితో కిడ్నీలో రాళ్లు రావడం అనేది అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఆహారపు అలవాట్లు, నీళ్లు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ కారకాలు లాంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కిడ్నీలో ఏర్పడే రాళ్లను ఎలా గుర్తించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్లు చెబుతున్న సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్ల సమస్య వారసత్వంగా కూడా వస్తుందని చెబుతున్నారు ప్రముఖ యారాలజిస్ట్ ఉపేంద్ర. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వంశపారపర్యంగా వచ్చే అవకాశం అధికంగా ఉంటుందట. కిడ్నీలో రాళ్లు రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయన్నారు. అందులో వంశపారపర్యంగా రావడం ఒకటి కాగా.. రెండోది ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా నీరు సహా ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో రాళ్లు ఎక్కువగా వస్తుంటాయని వివరించారు.
ఇవే కాకుండా కిడ్నీలో రాళ్లు రావడానికి మరికొన్ని కారణాలున్నాయని డాక్టర్ ఉపేంద్ర చెప్పారు. "మన రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయిన సమయంలో మూత్రం ద్వారా వెళ్లి రాళ్లుగా ఏర్పడతాయి. ఇవి చాలా మందికి తరచుగా కిడ్నీలో రాళ్లుగా మారతాయి. కాల్షియం ఆక్సిలేట్ ఉన్నవాళ్లలో సైతం ఇలాంటి సమస్య వస్తుంది. హైపర్ పైరాథైరాయిడజం అనే హర్మోన్ సమస్య ఉన్నవాళ్లలో కూడా ఎక్కువగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి." అని తెలిపారు.
అయితే, మనకు ఏర్పడిన రాళ్లు ఎలాంటివి అని తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయని డాక్టర్ ఉపేంద్ర తెలిపారు. "కొందరికి మూత్రవిసర్జన చేసే సమయంలో కిడ్నీ నుంచి రాళ్లు బయటకు పడిపోతుంటాయి. వాటిని ల్యాబ్ కు పంపిస్తే మనకు ఏర్పడిన రాళ్ల ఎలాంటివో తెలుస్తుంది. అలా కుదరని పక్షంలో సీటీ స్కాన్ చేసి కూడా ఎలాంటి రాళ్లో తెలుసుకుని చికిత్స అందిస్తారు." అని వివరించారు.
ద్రవ పదార్థాలను ప్రతి గంటకు ఒకటి లేదా రెండు గ్లాసులు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే తిన్న తర్వాత లేదా బయట తిరిగి వచ్చినా, చెమటలు పట్టినా.. రెండు గ్లాసుల నీరు ఎక్కువగా తీసుకోవాలట. మధ్యరాత్రి సమయంలో ఒకసారి లేచి నీరు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఈ సమయాల్లోనే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందట. మూత్రం సాధారణంగా యాసిడ్ లాగా ఉంటుంది. ఇదే సమయంలో ఎండలో తిరిగి వచ్చినప్పుడు.. వాటర్ సరిగా తాగకపోతే.. మూత్రం గాఢతలో తేడాలు వచ్చి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉందని యూరాలజిస్ట్ ఉపేంద్ర చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడనవి..
- పాలకూర
- టమాటో
- క్యాబెజ్
- కాలీఫ్లవర్
- మటన్
- చికెన్
- ఉప్పును ఎక్కువగా తీసుకోవద్దు
- పాల పదార్థాలు(వెన్న, జున్ను, మీగడ)
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు యూరాలిజిస్ట్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. సిటీ స్కాన్, యూరిన్ పరీక్షలు చేయించుకుని ఎలాంటి రాళ్లు వచ్చాయో తెలుసుకుంటే మంచి చికిత్స అందిచవచ్చని అంటున్నారు. "కొన్ని ఆల్కలైజర్ మందులు వాడుతుంటే రాళ్లు వచ్చినా.. చిన్నగా ఉన్న సమయంలోనే అవి పడిపోతుంటాయి. ఇవే కాకుండా.. నీరు, నిమ్మరసం, బార్లీ వాటర్, జ్యూస్ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీలోని రాళ్లు చిన్నగా ఉన్నప్పుడే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి." అని యూరాలజిస్ట్ ఉపేంద్ర చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS