Consanguineous Marriages
రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే - పిల్లలు నిజంగానే వైకల్యంతో పుడతారా? - నిపుణుల ఆన్సర్ ఇదే!
Are Child Born Mentally Handicapped If Married to a Relative? : హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు పెళ్లిళ్లు, దగ్గర బంధువుల మధ్య వివాహాలు కామన్. అయితే.. రక్త సంబంధీకులను వివాహం చేసుకుంటే.. పుట్టే పిల్లలు మానసిక వైకల్యంతో పుడతారా? జన్యుపరమైన వ్యాధులు వస్తాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి.. ఇది ఎంత వరకు నిజం? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దగ్గరి బంధువును, రక్త సంబంధీకులను వివాహాం(Marriage) చేసుకోవచ్చా? అంటే.. వైద్య నిపుణుల నుంచి చాలా వరకు "నో" అనే మాటే వినిపిస్తోంది. పిల్లలకు మేనరికపు వివాహాలు జరిపించే ముందు భవిష్యత్తులో వారికి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇలాంటి వివాహాల కారణంగా.. పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు.
సాధారణంగా జన్యుపరమైన లోపాలలో కొన్నింటిని డామినెంట్ డిసీజెస్గా, మరికొన్నింటిని రెసిసివ్ డిసీజెస్గా వర్గీకరిస్తారు. అయితే.. మేనరికపు వివాహాలు చేసుకునేటప్పుడు దంపతులలో ఎవరికైనా ఏదైనా డామినెంట్ డిసీజ్ ఉంటే.. వారికి పుట్టబోయే పిల్లలకు అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆబ్స్స్టిట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ.
ఇక రెసిసివ్ జన్యుపరమైన లోపాల గురించి చూస్తే.. అవి ఒక వ్యక్తిలో ప్రత్యేకంగా పైకి కనిపించవని చెబుతున్నారు. కానీ, ఈ జన్యుపరమైన లోపం వారిలో ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి పెళ్లి చేసుకునే బంధువుల అమ్మాయికి లేదా అబ్బాయికి కూడా ఆ రెసిసివ్ జన్యు లోపం ఉంటే.. సమస్య పెద్దదిగా మారుతుందని చెబుతున్నారు. వారిద్దరిలోని ఈ కనిపించని రెసిసివ్ డిసీజెస్ కలిసి.. డామినెంట్ డిసీజెస్గా మారే అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్ సరళ. అవి.. పుట్టబోయే పిల్లల్లో తీవ్ర సమస్యలకు కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.
అందుకే.. మేనరికపు వివాహాలలో వ్యక్తి.. పైకి చూడడానికి ఆరోగ్యంగా కనిపించినా, మిగతా వారికంటే వీరికి పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే వైద్యపరంగా డాక్టర్లు చాలా వరకు ఇలాంటి వివాహాలను జరిపించొద్దని చెబుతుంటారని డాక్టర్ సరళ వివరిస్తున్నారు.
అలాగని.. పూర్వకాలంలో మా చుట్టాలు మేనరిక వివాహాలు చేసుకోలేదా? మేనమామల్ని, మేనబావల్ని పెళ్లి చేసుకోలేదా? వారంతా మంచిగా లేరా? అనే సందేహాలు మీకు రావొచ్చు. కానీ, అంతా బాగున్న వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాకాకుండా.. వారిలో ఉండే రెసిసివ్ జీన్స్ కారణంగా పుట్టే బిడ్డ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జన్యుపరమైన లోపంతో పుడితే అప్పుడు లైఫ్ లాంగ్ ఆ బిడ్డతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి.. వీలైనంత వరకు రక్త సంబంధిత వివాహాలకు దూరంగా ఉండడమే బెటర్ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ సలహా ఇస్తున్నారు.
COMMENTS