Pimples come even if you sleep like this! - Check how you sleep
ఇలా నిద్రపోయినా కూడా మొటిమలు వస్తాయట! - మీరు ఎలా పడుకుంటున్నారో చెక్ చేసుకోండి.
Avoid These Sleeping Mistakes For Skin Care : వయసుతో సంబంధం లేకుండా కొందరిని మొటిమలు వేధిస్తుంటాయి. అయితే.. ఈ మొటిమలు(Pimples) రావడానికి కేవలం హార్మోనల్ ఛేంజస్ మాత్రమే కాకుండా.. నిద్రపోయేటప్పుడు చేసే పొరపాట్లు కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేకప్ :
కొంతమంది తరచూ మేకప్ వేసుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. ఓపిక లేదంటూ మేకప్ తొలగించకుండానో.. లేదంటే పైపైన తొలగించుకొని నిద్రపోతారు. ఈ కారణంగా మొటిమలు వస్తాయంటున్నారు ప్రముక డెర్మటాలజిస్ట్ డాక్టర్ వాటెన్బర్గ్. ఎందుకంటే.. మీరు మేకప్ తొలగించని కారణంగా చర్మ రంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి మూసుకుపోతాయట. ఫలితంగా మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. మేకప్ పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రపోవడం మంచిదంటున్నారు. అప్పుడే చర్మానికి రక్తప్రసరణ కూడా మెరుగై.. మేను కాంతివంతంగా మారుతుందని సూచిస్తున్నారు.
వాటిని మార్చకపోవడం :
చాలా మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. దిండు కవర్లను రోజుల తరబడి వాష్ చేయకుండా, మార్చకుండా వాడుతుంటారు. దీని కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నార్మల్‌గా స్కిన్ రిలీజ్ చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దాంతో అదే దిండును ఎక్కువ రోజులు వాడడం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి చేరి.. వాటిని మూసేస్తాయి. ఫలితంగా మొటిమలొస్తాయంటున్నారు. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే.. వారానికి ఓసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం, దిండ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే.. వీలైనంత వరకు ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా చూసుకోవడం మంచిదంటున్నారు.
పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!
జుట్టుకు నూనె పెట్టడం :
కొందరికి నైట్ జుట్టుకు నూనె పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు క్రమంగా మొటిమలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. కుదుళ్లలోని జిడ్డుదనం పరోక్షంగా ముఖ చర్మంపై సీబమ్ ఉత్పత్తిని పెంచుతుందట. ఇలా అవసరానికి మించి ఎక్కువ నూనెలు ఉత్పత్తవడం వల్ల ఫేస్‌పై మొటిమలొస్తాయని చెబుతున్నారు. అందుకే.. పడుకునే ముందు ఈ అలవాటును మానుకోడం బెటర్ అంటున్నారు. దానికి బదులుగా.. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టుకు నూనె అప్లై చేసి.. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో హెడ్‌బాత్ చేయడం ఉత్తమమంటున్నారు. ఫలితంగా మొటిమల ముప్పూ తప్పుతుందని సూచిస్తున్నారు.
పడకగది వాతావరణం :
నిద్రించే సమయంలో బెడ్రూమ్ వెదర్ కూడా మొటిమలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పడకగదిలోని వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ వాతావరణాల కారణంగా జిడ్డుదనం పెరిగి మొటిమలొస్తాయంటున్నారు. అలాగే ఏసీలు, హ్యుమిడిఫైయర్ల వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు.
వీటితో పాటు నైట్ పడుకునే ముందు కాఫీ/టీ(Tea) వంటివి తాగకపోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడం, వెల్లకిలా పడుకోవడం, నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల నైట్ క్రీమ్‌లు వాడడం.. వల్ల కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS