Do you have 'nomophobia'? Does this happen even if you don't have a smartphone for a moment?
మీకు 'నోమోఫోబియా' ఉందా? ఒక్క క్షణం స్మార్ట్‌ఫోన్ లేకపోయినా ఇలా అవుతోందా?
What is Nomophobia : స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగంగా మారాయి. ప్రతి ఒక్కరి జేబులో డబ్బులు లేకపోయినా, ఫోన్ మాత్రం తప్పనిసరిగా ఉంటోంది. ఫోన్లతో మనిషికి అంతగా అటాచ్‌మెంట్ పెరిగింది. ఫోన్‌కు దూరంగా ఉన్న టైంలో కొందరికి భయం, ఆందోళన కలుగుతుంటుంది. అంటే వారిని 'నోమో ఫోబియా' చుట్టుముట్టిందని అర్థం. 'నోమో' ఫుల్ ఫామ్ 'నో మొబైల్'. ఇదొక మానసిక రుగ్మత.
నోమోఫోబియా మూలాలు:
'నోమోఫోబియా' అనే మానసిక రుగ్మతను తొలిసారిగా 2008 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గుర్తించారు. అప్పట్లో యూకే పోస్టాఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో దీనిపై స్పష్టత వచ్చింది. బ్రిటన్‌లోని మొబైల్ ఫోన్ వినియోగదారులలో 53 శాతం మంది తమ ఫోన్లను ఉపయోగించలేనప్పుడు ఆందోళన చెందుతున్నారని ఆ పరిశోధనలో వెల్లడైంది.
నోమోఫోబియా లక్షణాలు, సంకేతాలివే!
నిత్యం చెక్ చేయడం : నోమోఫోబియా బారినపడిన వారు తమ ఫోన్‌కు కొత్త నోటిఫికేషన్‌లు, మెసేజ్‌లు రానప్పటికీ- వాటి కోసం తరచుగా ఫోన్‌ను చెక్ చేస్తుంటారు.
ఆందోళన : చేతిలో ఫోన్ లేకపోయినా- ఫోన్, ఇంటర్నెట్ సిగ్నల్స్ కనెక్టివిటీని కోల్పోయినా చాలా కలవరపడతారు.
డిపెండెన్సీ : కొంతమంది గుర్తింపు కోసం, వినోదం కోసం, ఆన్‌లైన్ సామాజిక వేదికల్లో యాక్టివ్‌గా ఉండటానికి ఫోన్లను వాడుతుంటారు. ఈ క్రమంలో తమ ఉనికి అనేది ఆ ఫోన్‌పైనే ఆధారపడి ఉందనే భావనలో జీవిస్తుంటారు.
నిత్యం ఫోన్‌కు దగ్గరలోనే : ఫోన్‌కు నిత్యం దగ్గరగా ఉండేందుకు కొందరు ఇష్టపడతారు. సాధ్యమైనంత మేర ఫోన్‌ను తాము ఉన్న ప్రదేశానికి దూరంగా పెట్టరు.
నోమోఫోబియాకు కారణాలివీ:
సాంకేతికతపై ఆధారపడటం : కమ్యూనికేషన్, సమాచారం, వినోదం కోసం నేటి కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లపై బాగా ఆధారపడుతున్నారు. దీంతో అవి మన దినచర్యలలో తొలగించలేని భాగంగా మారాయి.
ఎడబాటు భయం(FOMO): ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్‌నే FOMO అంటారు. ముఖ్యమైన సంఘటనలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు కొందరు నిత్యం ఫోన్‌ను చూస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఇతరులతో తమ కనెక్టివిటీ తెగిపోకుండా ఉండేందుకు పాకులాడుతుంటారు. సోషల్ మీడియా యాప్స్‌ను నిత్యం చూస్తుంటారు.
సామాజిక ఒత్తిడి : ఉన్నతాధికారులు, కుటుంబ పెద్దలు, సన్నిహితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. వాటిని లిఫ్ట్ చేసి ఎప్పటికప్పుడు సమాధానం ఇచ్చేలా సంసిద్ధంగా ఉంటారు. ఒకవేళ కాల్స్ లేదా మెసేజ్‌లకు బదులివ్వకుంటే సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే ఆత్రుత, ఆందోళన చుట్టుముడుతుంటాయి.
ఫోన్లతో అటాచ్‌మెంట్ : కొంతమంది తమ ఫోన్లతో ఎమోషనల్‌గా అటాచ్ అవుతుంటారు. అవి చేతిలో లేని క్షణాల్ని అస్సలు ఊహించుకోరు. ఫోన్ చేతిలో లేకుంటే ఎలాగో అనే ఆందోళన పట్టిపీడిస్తుంటుంది.
మానసిక ఆరోగ్యంపై నోమోఫోబియా ప్రభావం:
ఒత్తిడిలో పెరుగుదల : ఫోన్‌ను నిత్యం చెక్ చేస్తుండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫోన్ తప్పనిసరిగా చేతిలో ఉండాలని భావన కూడా మనపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది మన విశ్రాంతికి కూడా అంతరాయం కలిగిస్తుంటుంది.
నిద్రకు ఆటంకాలు : స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారితే, పదేపదే ఫోన్ నోటిఫికేషన్లను చెక్ చేసే అలవాటు అయితే మన నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేం. ఇది నిద్రలేమి సమస్యను సృష్టిస్తుంది.
సోషల్ ఐసొలేషన్ : సోషల్ మీడియాలో నిత్యం మునిగితేలే వారికి నిజ జీవితంలో ఇమిడేందుకు చాలా సమయం పడుతుంది. దీనివల్ల వారు వాస్తవ ప్రపంచంలో అంతగా సంబంధాలను ఏర్పర్చుకోలేరు. ఫలితంగా ఒంటరితనం వారిని వెంటాడుతుంది.
ఉత్పాదకత తగ్గడం : ఫోన్ వాడకానికి బానిసగా మారడం వల్ల మనం చాలా సమయాన్ని వృథా చేస్తుంటాం. నోటిఫికేషన్లను చూసేందుకు, యాప్‌లను తెరిచి చూసేందుకు చాలా టైంను వెచ్చిస్తుంటాం. దీనివల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుంది. మన అసలు పనిపై దృష్టి పెట్టలేం. ఫలితంగా మన పనితీరు దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది.
నోమోఫోబియాను అధిగమించే మార్గాలివీ:
టైం తగ్గించండి : స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాన్ని క్రమంగా తగ్గించాలి. మధ్యమధ్యలో కొంత విరామం తీసుకోవాలి. దీనివల్ల ఆందోళన , ఆత్రుత చాలావరకు తగ్గిపోతాయి.
లిమిట్ పెట్టుకోండి : ఫోన్ వినియోగం కోసం నిర్దిష్ట సమయాలు పెట్టుకోండి. దీనివల్ల రోజుల్లో ఎంతసేపు ఆన్‌లైన్‌లో ఉండాలి? ఎంతసేపు ఆఫ్‌లైన్‌లో ఉండాలి ? అనే దానిపై ముందస్తు స్పష్టత వస్తుంది. దాని ప్రకారమే రోజూ నడుచుకోవాలి.
మైండ్‌ఫుల్ మెడిటేషన్ : ప్రస్తుత క్షణాల్లో జీవించేలా చేయడం మైండ్‌ఫుల్ మెడిటేషన్ ప్రత్యేకత. ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. క్రమంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.
నిపుణుల సహకారం : నోమోఫోబియా వల్ల మానసిక స్థితిగతులపై ప్రభావం పడినట్లు కనిపిస్తే, తప్పకుండా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు తగిన సలహాలను అందిస్తారు. ఎమోషనల్ గైడెన్స్ ఇస్తారు.
COMMENTS