113 new medical colleges in the country - how many in Telugu states..
New medical colleges : దేశంలో కొత్తగా 113 మెడికల్ కాలేజీలు- తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..
దేశవ్యాప్తంగా 113 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) తాజాగా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆయా కాలేజీలు, 2024-25 విద్యాసంవత్సరం నుంచే యూజీ వైద్య కోర్సులను ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.
"2024-25 విద్యాసంవత్సరానికి గాను కొత్త అండర్ గ్రాడ్జ్యుయేట్ మెడికల్ కాలేజీల స్థాపనకు అప్లికేషన్లు అందాయి. 113 అప్లికేషన్స్‌కి అనుమతిస్తూ, సంబంధిత వివరాలను ఈ-మెయిల్స్ ద్వారా ఆయా కాలేజీలకు పంపించాము," అని ఎంఏఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పబ్లిక్ నోటీస్‌తో పాటు ఆ 113 అప్లికేషన్స్‌కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్స్‌ని సైతం యాడ్ చేసింది ఎంఏఆర్బీ.
2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతుల కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటితో పాటు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీల వివరాలను ఎన్ఎంసీ కొంత కాలం క్రితం ఓ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ విషయంపై 170 అప్లికేషన్లు అందినట్టు, ఆయా సంస్థలకు ఈ-మెయిల్స్ ద్వారా తుది నిర్ణయాన్ని తెలిపినట్టు స్పష్టం చేసింది.
తాజాగా.. యూపీలో 22, మహారాష్ట్రలో 14, రాజస్థాన్‌లో 12, తెలంగాణలో 11, పశ్చిమ్ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్‌లో 7, ఆంధ్రప్రదేశ్‌లో 7, కర్ణాటకలో 5, తమిళనాడులో 5, కేరళలో 2 వైద్య కళాశాలలు కొత్తగా ఓపెన్ అవ్వనున్నాయి.
ఉత్తరాఖండ్‌కు 3, ఒడిశా- గుజరాత్‌కు రెండు, హరియాణా, అసోం, పంజాబ్, సిక్కిం, త్రిపురలకు తలో ఒక మెడికల్ కాలేజ్ దక్కాయి.
113లో కొన్ని కాలేజీల వివరాలు.. దిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నజప్గఢ్ (దక్షిణ దిల్లీ), స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్, శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడికల్ సెహోర్ (ఎంపీ), ఆటోనొమస్ స్టేట్ మెడికల్ కాలేజీ కుషీనగర్ (యూపీ), ఆటోనొమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ పిల్బిత్ (యూపీ), భరత్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పురీలియా (యూపీ), అటోనొమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ సొసైటీ డిస్ట్రిక్ట్ మేల్ అండ్ ఫీమేల్ హాస్పిటల్ సుల్తాన్పూర్, మహాత్మ విధుర్ ఆటోనొమస్ స్టేట్ మెడికల్ కాలేజీ, బిజ్నూర్.
ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎంఏఆర్బీ అనుమతులు ఇవ్వందే ఏ విద్యాసంస్థ కూడా కొత్త కోర్సులను ప్రారంభించేందుకు వీలు లేదు.
అయితే కొత్త వైద్య కళాశాల అనుమతుల విషయంలో ఎన్ఎంసీ ఇటీవలే పలు మార్పులు చేసింది. రన్నింగ్‌లో ఉన్న హాస్పిటల్, అన్ని విభాగాల్లో ఫాకల్టీ ఉంటే, ఇప్పుడు 50 సీట్లతోనే వైద్య కళాశాలను ప్రారంభించుకోవచ్చు. ఆయా హాస్పిటల్స్‌కి కనీసం 200 బెడ్లు, 20 ఐసీయూ బెడ్ల కెపాసిటీ ఉండాలి.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో ఇప్పుడు 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొత్త మెడికల్ కాలేజీలతో ఆ సంఖ్య 800 దాటుతుంది. వీటిల్లో 50 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా మిగిలినవి ప్రైవేట్ లేదా డీమ్డ్ వర్సిటీలు.
2013-14తో పోల్చుకుంటే ఎంబీబీఎస్ కోసం యూజీ సీట్లు 110శాతం పెరిగాయి. నాడు సీట్ల సంఖ్య 51,348. ఇప్పుడు 1,08,990గా ఉంది. పీజీ కోర్సుల సీట్లు 2013-14లో 31,185 నుంచి 2023-24లో 68,073 (118శాతం) పెరిగాయి.
COMMENTS