Indian Railways: Railway measures to ensure that there is no ticket.. fine and imprisonment
Indian Railways: టిక్కెట్ లేకపోతే తిక్క తీరేలా రైల్వే చర్యలు.. జరిమానాతో పాటు జైలు శిక్ష.
భారతదేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ టక్కున గుర్తుచ్చేది రైలు. రైల్వే ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా మారింది. రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ప్రయాణికుల్లో మనం ఏ పాటి అనే చందాన చాలా మంది టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వీరి వల్ల రైల్వేకు కోట్లల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా రైళ్లల్లో జరిగే దొంగతనాలకు చాలా వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారే కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లెస్ ప్రయాణాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఎదుర్కోవాల్సిన ఇబ్బందుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అధికారిక నిబంధనల ప్రకారం భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే జరిమానా విధిస్తుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి లేదా స్టార్టింగ్ స్టేషన్ నుండి అదనంగా రూ.250 ఛార్జీతో సాధారణ సింగిల్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో పాటు మొత్తం రైల్వే టిక్కెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు. అలాగే మోసపూరిత ప్రయాణానికి రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. అలారం చైను లాగితే 12 నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. వికలాంగ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లో సాధారణ ప్రయాణీకుడు ప్రయాణిస్తే వారికి 3 నెలల జైలు, రూ. 500 జరిమానా లేదా రెండూ పొందవచ్చు. అలాగే రైలు పైకప్పుపై ప్రయాణం చేస్తే 3 నెలల జైలు లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ విధిస్తారు.
భారతీయ రైల్వేలు భద్రత పై ఎక్కువ ఖర్చు చేయనుందని, ఈ మేరకు రైల్వే మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్ ద్వారా ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే రూ. 2.62 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయంలో దాదాపు సగం ఖర్చు చేయాలని యోచిస్తోంది. సాధారణ, నాన్-ఏసీ ప్రయాణీకుల కోసం మరిన్ని కోచ్‌లను అందుబాటులో తీసుకొస్తామని రైల్వే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
COMMENTS