Income Tax: Section 80C is not the only one.. More than that, these are the ways to save tax..
Income Tax: సెక్షన్ 80సీ ఒక్కటే కాదు.. అంతకు మించి పన్ను ఆదా చేసే విధానాలు ఇవి..
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమవుతోంది. కేవలం ఒక వారం మాత్రమే గడువు ఉంది. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ని కొత్త లేదా పాత పన్ను విధానంలో ఫైల్ చేసేందుకు అవకాశం ఉంది. పాత పన్ను విధానాన్ని అనుసరించే వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపు పన్నును ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. సెక్షన్ 80సీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును ఇస్తుంది. ఇది రూ. 12 లక్షల వార్షిక జీతం బ్రాకెట్‌లో కూడా ఎవరైనా పొందుకోగలిగే గణనీయమైన మొత్తం. అయితే సెక్షన్ 80సీ ఒక్కటే కాదు. మీ ఆదాయపు పన్నును చాలా వరకు తగ్గించడంలో మీకు సహాయపడే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. తెలివిగా ఉపయోగించినట్లయితే, ఈ విభాగాలు ఆర్థిక సంవత్సరంలో లక్షల విలువైన పన్నును ఆదా చేయడంలో మీకు సహాయపడతాయి. వాటిలో కొన్నింటిని మీకు అందిస్తున్నాం. చదివేయండి..
హోమ్ లోన్.. ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించాలన్నా హోమ్ లోన్ అవసరమవుతోంది. దీనికి తప్పనిసరిగా వడ్డీ ఉంటుంది. అయితే ఈ వడ్డీపై పన్ను రాయితీ ఉంటుంది. హౌసింగ్ లోన్ తీసుకున్న మొత్తంపై వడ్డీకి సంబంధించి సెక్షన్ 24(బీ) ప్రకారం ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
ఎన్పీఎస్.. పన్ను ఆదాను అందించే మరో పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్). ఎన్పీఎస్ టైర్-1 ఖాతాదారుడు సెక్షన్ 80సీ కింద ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే వారు సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ. 50,000 అదనపు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందుకునే వీలుంది.
హెల్త్ ఇన్సురెన్స్.. మీరు వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామి, పిల్లల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటూ ఉంటారు. దానిని ప్రీమియంలు చెల్లిస్తూ ఉంటారు. అలా కట్టిన చెల్లింపులపై రూ. 25,000 వరకు పన్ను ప్రయోజనం పొందే వీలుంటుంది. అంతే కాకుండా, సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.50,000 వరకూ పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇంటి అద్దె.. మీరు మీ ఇంటి యజమానికి చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే పన్ను మినహాయింపులు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. అద్దె పరిమితి కనీసం నెలకు రూ. 5,000 లేదా మొత్తం వార్షిక ఆదాయం 25 శాతం లేదా ప్రాథమిక వార్షిక ఆదాయంలో 10 శాతం ఉండాలి.
విద్యా రుణం.. మీ పిల్లల ఉన్నత విద్యా కోసం తీసుకునే విద్యా రుణాలపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. లోన్ పై వర్తించే వడ్డీ చెల్లింపుపై మీకు పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80ఈ కింద ఇది వస్తుంది. దీనికి గరిష్ట పరిమితి లేదు.
దివ్యాంగులు.. దివ్యాంగ చెల్లింపుదారులు సెక్షన్ 80యూ కింద అదనపు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. వారు 40 శాతం నుంచి 80 శాతం వైకల్యానికి రూ. 75,000 పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ. 1,25,000 పన్ను మినహాయింపును పొందవచ్చు.
COMMENTS