Can hair tell blood quality? What do the experts say?
రక్తం క్వాలిటీని జుట్టు చెప్పగలదా? నిపుణులు ఏమంటున్నారు?
Hair Indicate Blood Quality : మన ఆరోగ్యం, అందం, చర్మం, జుట్టు సంరక్షణల విషయంలో చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు, అనుమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి వెంట్రుకల ఆరోగ్యాన్ని బట్టి మీ శరీరంలో రక్తం నాణ్యతను తెలుసుకోవచ్చు అని అంటారు. ఇది నిజమా లేక అపోహ అన్న విషయాలను పరిశీలిస్తే తాజా అధ్యయనాలు కొన్ని వెంట్రుకల ఆరోగ్యం గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. అవును జుట్టు రంగు, పరిమాణం శరీరంలో ఉండే రక్తం నాణ్యతకు ప్రతిబింబంగా వ్యవహరిస్తుందని ప్రముఖ సౌందర్య నిపుణులు జాకీ జాన్ రూలర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చారు.
జాన్ రూలర్ అభిప్రాయం ప్రకారం,వెంట్రుకల ఆరోగ్యం కేవలం రక్తం నాణ్యతకు మాత్రమే కాదు. కిడ్నీ పనితీరుకు కూడా అద్దం పడుతుందట. మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఇవి సరిగ్గా పనిచేస్తేనే విటమిన్లు, ఖనిజాలు, హార్మోర్లు, ప్రొటీన్లను రిసైకిల్ అవుతాయి. ఫలితంగా శరీరం చక్కగా పనిచేస్తుంది. అలా కాకుండా ఏదైనా గాయం కారణంగా లేక అధిక రక్తపోటు, అధిక గ్లూకోజ్ స్థాయిలు, హానికరమైన మెడిసిన్ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడిందంటే రక్తాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యం తగ్గుతుంది.
మూత్రపిండాల్లో రక్తాన్ని ఫిల్టర్ చేసే శక్తి క్షీణించినప్పుడు వెంట్రుకల రంగు, మందానికి తగిన ఖనిజాలు, పోషకాలు రక్తంలో ఉండవు. అయితే మగవారి విషయంలో ఇది భిన్నంగా ఉండచ్చని రూలర్ చెబుతున్నారు. మగవారిలో బట్టతల రావడానికి అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు కారణమవుతాయట. ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే వారి జుట్టు త్వరగా బూడిద రంగులో మారుతుందట. అలాగే ఎక్కువగా ఏడ్చే వారు, దు:ఖంతో బాధపడేవారి వెంట్రుకలు త్వరగా తెల్లగా మారతాయని రూరల్ చెబుతున్నారు.
ఇదే విషయం గురించి ప్రముఖ న్యూరోలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఏం చెబుతున్నారంటే? "ఒక వ్యక్తి వెంట్రుకల ఆరోగ్యాన్ని బట్టి రక్తం క్వాలిటీ ఖచ్చితంగా చెప్పలేం అయితే కొన్ని వ్యాధుల కారణంగా జుట్టు ఆరోగ్యం విషయంలో వచ్చే రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రక్త హీనత, ఐరన్ లోపం వంటి రక్త రుగ్మతలను పరిశీలిస్తే వీటి కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. అలాంటప్పుడు జుట్టు సన్నగా, పెళుసుగా మారుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాలకు సంబంధిన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా జుట్టు, గోర్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్యలు కూడా జుట్టు ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటిని రక్తపరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. కాబట్టి ఒకరి రక్తం నాణ్యతకు జుట్టుకు నేరుగా సంబంధం ఉందన్న దాంట్లో వాస్తవం లేదు" అని ఆయన చెప్పారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS