AP Govt : Gazette notification for GPS implementation - Employees and teachers unions in agitation..!
AP Govt : జీపీఎస్ అమలకు గెజిట్ నోటిఫికేషన్ - ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు..!
జీపీఎస్ అమలకు గెజిట్ నోటిఫికేషన్:
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) అమలపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్, జీపీఎస్‌ను సమీక్షంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు, అధికార బాధ్యలు చేపట్టిన నెలకే గెజిట్ విడుదల చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నాయి.
2023 అక్టోబర్ 20 నుంచే అమలులోకి
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (ఏపీజీపీఎస్)లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ 20 నుంచే జీపీఎస్ అమలులోకి వస్తుందని గెజిట్‌లో పేర్కొంది. జీపీఎస్ చట్టం-2023లోని చాప్టర్ 1లోని సెక్షన్ 1, సబ్ సెక్షన్ (3) ప్రకారం ఈ గెజిట్ విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పేరు మీదుగా గెజిట్ విడుదల అయింది.
జీపీఎస్‌కి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికార బాధ్యతలు తీసుకున్న జూన్ 12నే జీవో నెంబర్ 54ను విడుదల చేశారు. అయితే ఈ జీవోను బయటికి రాలేదు. శుక్రవారం విడుదల చేసిన గెజిట్‌లో జూన్ 12వ తేదీనే జీవో నెంబర్ 54 విడుదల చేశామని పేర్కొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయల ఆందోళన:
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తానని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. కానీ సీపీఎస్‌ను రద్దు చేయలేదు. దీంతో సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి.
2022 ఫిబ్రవరి 3న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. భారీగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయలతో విజయవాడలో ప్రభంజనం సృష్టించారు. దీంతో దిగొచ్చిన ఏపి ప్రభుత్వం సీపీఎస్‌పై కమిటీ వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయల మధ్య విభజనకు కూడా ప్రభుత్వం పూనుకుంది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయలు కన్నెర్ర చేశారు.
సీపీఎస్‌పై ప్రభుత్వం కమిటీ:
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం 2022 ఏప్రిల్ 25న కమిటీ వేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదితమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సూచిస్తూ నివేదిక ఇచ్చింది. దానికనుగుణంగా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.
అయితే ఇటీవలే జరిగిన (2024 మే 13న) ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ అధినేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ప్రజాగళం పేరుతో విడుదల చేసిన టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో కూడా సీపీఎస్, జీపీఎస్‌పై పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.
కానీ ఇప్పటివరకు ఎటువంటి పునఃసమీక్ష చేయలేదు. ఇదే సమయంలో జీపీఎస్ అమలుపై అధికార బాధ్యతలు చేపట్టిన రోజే (జూన్ 12న) జీవో నెంబర్ 54 తీసుకొచ్చారు. సరిగ్గా నెల రోజుల తరువాత శుక్రవారం రాత్రి (జులై 12న) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మండిపడుతున్నాయి. అయితే ఈ గెజిట్ పై ప్రభుత్వంలోని పెద్దలు స్పందించాల్సి ఉంది…!
రద్దు చేయాల్సిందేః యూటీఎఫ్ నేతలు డిమాండ్:
జీపీఎస్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటీఫికేషన్ దుర్మార్గమని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. ఇదొక దుర్మార్గమైన చర్యఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించడమే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష అని తెలిపారు.
COMMENTS