Release of farmer loan waiver guidelines- Rs.2 lakh loan waiver for every farmer family, ration card is standard
Crop Loan Waiver : రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల- ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ,రేషన్ కార్డు ప్రామాణికం.
Crop Loan Waiver Guidelines : తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
రైతులకు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే... రైతులు ముందుగా రూ.2 లక్షలకు పైబడిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రైతులకు రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం నేరుగా రైతు రుణ అకౌంట్లలోకి జమ చేస్తుంది. ఉదాహరణకు రూ.2.50 లక్షల రుణం ఉంటే రైతు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు ప్రభుత్వ చెల్లిస్తుంది.
పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుంది. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ అవుతాయి. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రం రుణమాఫీ వర్తించదని వ్యవసాయ శాఖ పేర్కొంది. రుణమాఫీపై ఫిర్యాదులు, రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. రైతు రుణమాఫీపై మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలు:
- తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది.
- ఈ పథకం స్వల్ప కాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
- తెలంగాణలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ ల నుంచి రైతుల తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- 12-12-2018 నుంచి మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 9-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
- ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ రుణమాఫీ అవుతుంది.
- రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు)ను ప్రమాణికంగా తీసుకుంటారు.
అమలు ఇలా?
వ్యవసాయశాఖ కమిషనర్, డీఓఏ పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. వ్యవసాయశాఖ, ఎన్ఐసీ సంయుక్తంగా రుణమాఫీ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ ను నిర్వహిస్తారు. ఈ పోర్టల్ లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ పోర్టల్ లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పిస్తారు. రైతుల నుంచి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతు రుణమాఫీ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమిస్తారు. ఈ నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ, ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. నోడల్ అధికారి పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో పీడీఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి బకాయి ఉంటే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారు.
రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా రైతు రుణఖాతాలకు జమచేస్తారు. రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు రుణమాఫీ మొత్తాన్ని సీఏసీఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 తేదీ నాటికి ఉన్న రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమచేస్తారు. ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ.2.00 లక్షలకు పైబడిన రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగిన మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.
వీటికి రుణమాఫీ వర్తించదు:
రైతు రుణమాఫీ ఎస్హెచ్జీలు, జెఎల్బీలు, ఆర్ఎంజీలు, ఎల్ఇసీఎస్ లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు.
కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం పరిగణనలోనికి తీసుకుంటారు. ప్రతి బ్యాంకు డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణ ఖాతా వివరాలు ప్రభుత్వానికి అందించాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంట్ పై రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు అధికారి డిజిటల్ సంతకం చేయాలి.
ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులు కారని తెలిసినా పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖకు అధికారం ఉంటుంది. లోన్ అకౌంట్లలో ఉన్న డేటాను నిర్ధారించేందుకు అధికారులు ఆడిట్ చేస్తారు.
COMMENTS