'Bhu-Aadhaar' for every plot within three years - digitization of land records in towns
'మూడేళ్లలోగా ప్రతి ప్లాట్‌కు 'భూ-ఆధార్' - పట్టణాల్లో భూరికార్డుల డిజిటలైజేషన్'
Bhu Aadhaar : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కీలక భూసంస్కరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, వాటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు ఆమె ప్రకటించారు. 'యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్' (యూఎల్ పిన్) పేరుతో ఈ సంఖ్యను కేటాయిస్తామని వెల్లడించారు. దీన్నే 'భూ ఆధార్' అని కూడా పిలుస్తామన్నారు. వచ్చే మూడేళ్లలోగా ఈ సంస్కరణల ప్రక్రియను పూర్తి చేసేందుకుగానూ రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించడం సహా ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిస్తుందని నిర్మల సీతారామన్ తెలిపారు. భూ సంస్కరణలలో భూ పరిపాలన, ప్రణాళిక - నిర్వహణ అనేది తొలి అంశమని ఆమె చెప్పారు. పట్టణ ప్రణాళిక, వినియోగం - బిల్డింగ్ బైలాలు అనేవి రెండో అంశమని పేర్కొన్నారు.
మ్యాప్‌ల డిజిటలైజేషన్:
ప్రతి భూమికి తప్పకుండా యూఎల్ పిన్ ఉండేలా చేయడమే తమ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మల స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయా భూముల కాడాస్ట్రాల్ మ్యాప్‌ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే, భూమి రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీకి లింక్ చేయడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేస్తామన్నారు. తద్వారా భవిష్యత్తుల్లో ఆయా భూములపై లోన్లు, వ్యవసాయ/పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియలు సులభతరం అవుతాయని నిర్మల పేర్కొన్నారు.
పట్టణ భూముల కోసం:
ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలోని భూరికార్డులను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) మ్యాపింగ్‌తో డిజిటలైజ్ చేస్తామన్నారు. స్థిరాస్తుల రికార్డుల నిర్వహణ, వాటి సమాచారం అప్‌డేషన్, భూమి సంబంధిత పన్ను వ్యవహారాల నిర్వహణకు దన్నుగా నిలవగలిగే చక్కటి ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. ఈ ఏర్పాట్ల వల్ల పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగు అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించే సంస్కరణల అమలులో క్రియాశీలంగా పనిచేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలను అందిస్తామని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
COMMENTS