AP Inter Admissions: The deadline for inter admissions in AP has been extended once again, chance till 31st July
AP Inter Admissions : ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, జులై 31 వరకు ఛాన్స్.
AP Inter Admissions : ఏపీ ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును మరోసారి ఇంటర్ బోర్డు మరోసారి పెంచింది. విద్యార్థులు జులై 31 వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి గడువని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు. ఏపీలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు మే 22 నుంచి జూన్ 1 వరకు మొదటి విడత, జులై 1 వరకు రెండో విడత ప్రవేశాలు నిర్వహించారు. ఇప్పటికే అడ్మిషన్ల గడువు ఒకసారి పొడిగించగా తాజాగా మరోసారి పొడిగిస్తూ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత ఆధారంగా ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
దివ్యాంగ విద్యార్థుల అడ్మిషన్లపై:
ఏపీలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులకు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో దివ్యాంగ విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం లాంగ్వేజ్ పేపర్ రాయడంలేదు. నాలుగు సబ్జెక్టులకే విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఈ ఏడాది నుంచి మద్రాస్ ఐఐటీ అడ్మిషన్లకు ఐదు సబ్జెక్టులు తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ మంచి మార్కులు సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారు. అయితే కౌన్సెలింగ్‌లో మార్కుల లిస్టును పరిశీలించిన ఐఐటీ, ఎన్ఐటీ అధికారులు నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థుల ప్రవేశాలను తిరస్కరించారు. దీనిపై విద్యార్థులు ఇంటర్ బోర్డును, మంత్రి నారా లోకేశ్ ను ఆశ్రయించారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించారు.
జీవో జారీ:
ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వారికి వివరించారు. ప్రభుత్వం నుంచి అధికారిక జీవో ఇస్తే వారికి అడ్మిషన్లు కల్పిస్తామని ఐఐటీ, ఎన్ఐటీ అధికారులు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. దీంతో జీవో 1161 ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు మేలు చేసేందుకు బోర్డు అధికారులు ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని సూచించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 జారీ చేశారు. ఈ జీవోతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందేందుకు అవకాశం దక్కింది.
COMMENTS