AP CRDA : Govt approval for filling posts in CRDA - notification soon..!
AP CRDA : సీఆర్‌డీఏలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం - త్వరలోనే నోటిఫికేషన్..!
AP CRDA Jobs 2024 : రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ)లో పోస్టులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఎలో వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. రాజధాని నిర్మాణ, ఇతరత్రా పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ మేరకు జులై 10న సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో…!
దీనికి స్పందించిన మున్సిపల్ మంత్రిత్వ శాఖ సీఆర్‌డీఏలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాలపరిమితితో పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో జారీ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 75 పోస్టులను భర్తీ చేయాలని, 68 పోస్టులను పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మించాలని నిర్ణయించినప్పుడు సీఆర్‌డీఏని ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో సీఆర్‌డీఏ బిల్లును కూడా ఆమోదించారు. అయితే 2014-19 మధ్య సీఆర్‌డీఏ పనులు చాలా చురుకుగా జరిగాయి. అందుకు తగ్గ ఉద్యోగులు ఉండేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెంది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలంటే, రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ప్రతిపాదన ముందుకు తెచ్చారు.
ఆ రకంగా రాష్ట్ర అసెంబ్లీలో సీఆర్‌డీఏ బిల్లును రద్దు చేసి, మూడు రాజధానుల బిల్లును ఆమోదించారు. అయితే శాసనమండలిలో పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో ఆ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అసెంబ్లీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించి, కేంద్రానికి పంపారు. ఇప్పుడు ఆ బిల్లు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉంది. అయితే సీఆర్‌డీఏ బిల్లు రద్దుపై రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది.
అయితే ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారో, అప్పటి నుండి సీఆర్‌డీఏ కార్యకలాపాలు స్తంభించాయి. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న వారినే వేరే డిపార్ట్‌మెంట్‌లకు ప్రభుత్వం తరలించింది. ఈ రకంగా ఆ ఐదేళ్ల కాలంలో సీఆర్‌డీఏలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలిచింది. దీంతో మళ్లీ అమరావతి అంశం తెరపైకి వచ్చింది.
దీంతో సీఆర్డీఏ కార్యకలాపాలు పుంజుకున్నాయి. కార్యకలాపాలు చురుకుగా ఉండటంతో సీఆర్‌డీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పోస్టుల భర్తీపై సీఆర్‌డీఏ ప్రతిపాదన పంపింది. కార్యకలాపాలు చురుగ్గా ఉండటానికి పోస్టుల భర్తీ అనివార్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పోస్టులు భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
COMMENTS