Alert..! Have you consumed Drugs? Can't escape anymore.. They will be found here..!
బీకేర్‌పుల్..! ఇది సేవించారా..? ఇక తప్పించుకోలేరు.. ఇట్టే దొరికిపోతారు..!
రాష్ట్రంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెట్టింది. మత్తుకు బానిస అవుతున్న యువతను ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మద్యం తాగి రోడ్డు ఎక్కితే డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినట్లుగానే, ఇక నుంచి గంజాయి తాగిన వారు తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే..?
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా..
తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉక్కుపాదంతో అణిచి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా, విశాఖ ఏజెన్సీ, ఒడిశా నుంచి భారీగా దేశంలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయి చేరుతోంది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాలు, గంజాయి ఇప్పుడు పల్లెలకూ విస్తరించాయి. అన్ని గ్రామాల్లో ఈజీగా గంజాయి దొరుకుతుందడంతో స్కూల్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్ల గంజాయికి బానిసలవుతున్నారు. మత్తులో నేరాలకు పాల్పడి భవిష్యత్తును జైలు పాలు చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేటు పెరిగింది. దీంతో గంజాయి విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ బ్యూరో బృందాలను ఏర్పాటుచేసింది.
ఆగని అక్రమ గంజాయి రవాణా, వినియోగం..
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని నిబంధనలు విధించినా.. అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్స్ వాహన తనిఖీల ద్వారా గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. మే నెలాఖరు వరకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూ.74.73 కోట్లు విలువ చేసే డ్రగ్స్, గంజాయిని సీజ్ చేశారు. 1580 మందిని అరెస్ట్ చేసి.. 788 కేసులు నమోదు చేశారు. అయినా.. గంజాయి రవాణా ఆగడం లేదు. గంజాయి తీసుకునే వారిని పట్టుకుంటే తప్పా.. సప్లై చైన్ ను బ్రేక్ చేసే అవకాశం లేకుండా పోతోంది. గంజాయి తీసుకున్న వారిని పట్టుకున్నప్పుడు వాళ్లు అసలు గంజాయి తీసుకున్నారో.. లేదో తెలిసేది కాదు. లోకల్ గా టెస్టులు చేసే అవకాశం లేదు. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారు ఈజీగా తప్పించుకుంటున్నారు.
గంజాయి తీసుకున్న వాళ్లని గుర్తించడం కూడా పోలీసులకు సవాల్ గా మారుతోంది. కల్తీ కల్లును నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు టాడి అడల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు. కానీ గంజాయి సేవించిన వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. గంజాయి పీల్చేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం కొత్తగా గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కిట్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు.
ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్టింగ్ కిట్..
గంజాయి తాగిన వ్యక్తి యూరిన్ పరీక్ష చేస్తే గంజాయి, డ్రగ్స్ నమూనాలు బయటపడతాయి. ఎవరైనా గంజాయి పీల్చే అలవాటు ఉందని అనుమానం వస్తే వెంటనే ఈ కిట్ల ద్వారా పరీక్షలు జరుపుతారు. గంజాయి డ్రగ్స్ వంటి 12 రకాల మత్తు పదార్థాలను ఈ కిట్టు ద్వారా గుర్తించవచ్చు. వ్యక్తి శరీర దృఢత్వాన్ని బట్టి నెల నుంచి 6 నెలల లోపు గంజాయి సేవించిన ఈ కిట్ పరీక్షల్లో తెలిసిపోతుంది. ఈ పరికరంతో సేకరించిన యూరిన్ పరీక్షలతో ఆ పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగెటివ్ గా, అదే సింగిల్ లైన్ కనిపిస్తే ‘పాజిటివ్’గా పరిగణిస్తారు. అలా పాజిటివ్ గా వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరివర్తన మిషన్…
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తే కలిగే అనర్ధాలపై ఇప్పటికే పోలీసులు కాలేజీలు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన గంజాయి కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిలో మైనర్లు, స్టూడెంట్లు ఉంటే ఫస్ట్ టైమ్ ఎలాంటి కేసు పెట్టకుండా పేరెంట్స్ రప్పించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించేస్తారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ల యూరిన్ శాంపిళ్లను మరోసారి హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిర్ధారిస్తారు. అక్కడ కూడా పాజిటివ్ వస్తే చార్జ్ షీట్ ఫైల్ చేసి పోలీసులు జైలుకు పంపిస్తారు.
COMMENTS