AC Maintenance: Exploding ACs.. You can be safe if you take these precautions..
AC Maintenance: పేలిపోతున్న ఏసీలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్‌గా ఉండొచ్చు..
వేసవి కాలం నేపథ్యంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్నా ఉక్కబోతతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాలలో చెట్లు ఉండడం వల్ల ఎండ నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక పట్టణాలు, నగర వాసుల ఇబ్బందులు వర్ణనాతీతం. వారికి ఇంట్లో ఏసీ ఉంటేగానీ నడవదు. ఎండల నేపథ్యంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది. అయితే ఏసీల కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఏసీ పేలి అగ్నిప్రమాదం..
నోయిడాలోని సెక్టార్ 100లో గల లోటస్ బౌలేవార్డ్ సొసైటీలోని ఒక ఫ్లాట్ లో మే 30వ తేదీన మంటలు చెలరేగాయి. ఫ్లాట్ లోని ఏసీ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన మంటలు, పొగ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చౌబే మాట్లాడుతూ ఫ్లాట్ లోని ఏసీలో పేలుడు సంభవించడంతో మంటలు రేగాయన్నారు. అయితే అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ (ఫైర్ ఫైటింగ్ సిస్టమ్) బాగుండడంతో మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించలేదని తెలిపారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఎయిర్ ఫిల్టర్లను మార్చాలి.. ఏసీలోని ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చాలి. ఈ ఫిల్టర్లు పాడైపోతే గాలి ప్రవాహం సక్రమంగా లోపలకు రాదు. దానిని లాక్కోవడం ఏసీకి కష్టమవుతుంది. దీంతో వేడెక్కిపోయి ప్రమాదం జరగవచ్చు. ఈ నేపథ్యంలో కంపెనీ సూచించిన విధంగా సకాలంలో ఎయిర్ ఫిల్టర్లను మార్పు చేసుకోవాలి.
క్లీన్ అవుట్ డోర్ యూనిట్.. చిన్నచిన్న ఆకులు తదితర వ్యర్థాలు కండెన్సర్ కాయిల్స్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. వాటి సామర్థ్యం తగ్గించి, ఏసీని వేడెక్కేలా చేస్తాయి. అవుట్ డోర్ యూనిట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలి. చెత్తను తొలగించడానికి నీటిని సున్నితంగా పిచికారీ చేయాలి. కానీ పవర్ వాషర్ ను ఉపయోగించకూడదు.
తగినంత ఖాళీ.. కంప్రెషర్ చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. బాగా ఇరుకుగా ఉండే ప్రాంతంలో బిగించకూడదు. బయటకు నుంచి గాలి సక్రమంగా తగిలేలా చూసుకోవాలి. గ్యాసోలిన్, పెయింట్ వంటి మండే పదార్థాలను ఏసీ దగ్గరలో ఉంచకూడదు.
ఓవర్ లోడ్.. ఏసీ యూనిట్లకు ప్రత్యేక సర్క్యూట్లు అవసరం. దీనికి ఎక్స్ టెన్షన్ కోర్డ్ ఉపయోగించడం వల్ల సర్క్యూట్ ఓవర్ లోడ్ అవుతుంది. తద్వారా మెషీన్ వేడెక్కిపోయే ప్రమాదం ఉంది.
నిర్వహణ.. ఏసీ నిర్వహణ చక్కగా చేయాలి. పనిలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ తో క్రమం తప్పకుండా సర్విసింగ్ చేయించాలి.
పరిశీలన.. ఏసీని వినియోగించేటప్పుడు దానిని నిరంతరం పరిశీలన చేయాలి. ఏవైనా శబ్ధాలు, వాసన వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కాలిన వాసన, ఎక్కువ శబ్ధం వస్తే వెంటనే ఆపివేయాలి. వెంటనే టెక్నీషియన్ ను పిలిపించి తనిఖీ చేయించాలి.
COMMENTS