Telangana: Dying herself.. Woman reincarnated to six..!
Telangana: తానూ చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించిన మహిళ..!
బతికున్నప్పుడు ఇతరులకు సహాయం చేయకపోయినా, కనీసం మట్టిలో కలిసేముందైనా మంచి చేసి అమరత్వం పొందాలంటారు మన పెద్దలు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. మరణించిన ఆ మహా తల్లి.. కొందరికి జీవం పోసి ప్రాణదాతగా నిలిచింది. ఓ మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేయడంతో మరో ఆరుగురికి పునర్జన్మ లభించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్ పేటకు చెందిన జంపాల సుజాత (42) ఆరోగ్యంగానే ఉంది. ఏమైందో ఏమో కానీ సుజాత.. కుటుంబ సభ్యులకు అన్నం వడ్డిస్తూ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుజాతను పరిశీలించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో వైద్యులు, జీవదాన్ ట్రస్టు.. అతడి కుటుంబ సభ్యులకు అవయవదానంపై ఆవశ్యకత, అవగాహన కల్పించారు. అవయవదానం చేయాలని జీవన్ దాన్ సిబ్బంది కోరడంతో సుజాత కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని అవయవ దానానికి అంగీకరించారు. ఆమె రెండు మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు తీసి జీవన్‌దాన్ ద్వారా ఆరుగురికి అమర్చారు. తాను మరణించి ఆరుగురికి జీవం పోసింది సుజాత. అనంతరం స్వగ్రామం బహదూర్ పేటలో ఆంత్యక్రియలు నిర్వహించారు. అవయవ దానం చేయడం పట్ల సుజాత భర్త దశరథ కొడుకు సునీల్, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. సుజాత భౌతికంగా లేకున్నా ఆమె అవయవాల వితరణతో మరో ఆరుగురిలో జీవించే ఉందని స్థానికులు కొనియాడారు. అవయవదానంతో అమరత్వం పొందిన సుజాత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు.
COMMENTS